ఏపీలో రాజకీయాలు అన్ని మూడు ఆరాజధానుల అంశం చుట్టూ తిరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తరువాత జగన్మోహన రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయాల్లో మూడు రాజధానుల అంశం ఒకటి. ఇప్పటికే అనేకమంది ఈ నిర్ణయాన్ని సమర్దిస్తుంటే, చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ నిర్ణయంతో సీఎం జగన్ రెడ్డి టీడీపీ, బీజేపీకి చెక్ పెట్టారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. మూడు రాజధానుల అంశం కార్యరూపం దాల్చినా, దాల్చకపోయినా కూడా జగన్ కే లాభమని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
న్యాయ వ్యవస్థను తరలించడం కష్టమా!!
అమరావతి రాజధానిగా తొలగిస్తూ మూడు రాజధానుల అంశాన్ని జగన్ తెరపైకి తెచ్చారు. కానీ ఈ నిర్ణయం మాత్రం అధికారికంగా కార్యరూపం దాల్చడం లేదు. శాసనసభ, శాసనమండలిలో తీర్మానం చేశారు. గవర్నర్ ఆర్డినెన్స్ ను కూడా జారీ చేశారు. అయినా మూడు రాజధానుల అంశం ముందుకు సాగడం లేదు. ఇది న్యాయస్థానాల్లో నలుగుతుండటమే ఇందుకు కారణం. ముఖ్యంగా న్యాయరాజధాని అంశంతో జగన్ కు ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చే అవకాశం ఇప్పట్లో లేనట్లే కన్పిస్తుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటుకు సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్రపతి మళ్లీ నోటిఫికేషన్ ను విడుదల చేయాల్సి ఉంటుంది. దీనికి పెద్ద కసరత్తే చేయాలంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దీనికి సహకరించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల కారణంగా బీజేపీ సహకరించే అవకాశాలు తక్కువేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
ఎలాగైనా జగన్ కే లాభం
మూడు రాజధానుల అంశం కార్యరూపం దాల్చినా, దాల్చకపోయినా కూడా జగన్ కే లాభమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు ఒకవేళ మూడు రాజధానుల అంశం ముందుకు సాగకపోతే, అన్ని ప్రాంతాల అభివృద్ధికి బీజేపీ, టీడీపీ నాయకులే అడ్డుపడుతున్నారని వైసీపీ నాయకులు రాజకీయం చేస్తారు. అలాగే ఒకవేళ మూడు రాజధానుల అంశం ముందుకు వెళ్తే మాత్రం జగన్ ను అడ్డుకునే శక్తి ఎవ్వరు ఉండరు. ఇలా మూడు రాజధానుల అంశంతో జగన్ దీర్ఘకాల రాజకీయం మొదలు పెట్టారు.