శివకేశవులకు ప్రతీకరమైన మాసం. అందులో ఇద్దరికీ ఇష్టమైన రోజు సోమవారం. అందులోనూ శివకేశవులకు ఇష్టమైన కార్తీక సోమవారం నాడు స్నాన, జపాలు ఆచరిస్తే వెయ్యి అశ్వమేథాల ఫలం దక్కుతుంది. సోమవార వ్రతాన్ని ఆరు విధాలుగా ఆచరిస్తారు. అనేక దోషాలు పోతాయి. ఈ సోమవారాల్లో పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం…
ఉపవాసం: కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసంతో గడిపి, సాయంకాలం శివుడికి అభిషేకం చేసి, నక్షత్ర దర్శనం తర్వాత తులసి తీర్థం సేవించడం.ఏకభుక్తం: దాన, తపం, జపాలు చేసిన తరువాత మధ్యాహ్నం పూట భోజనం చేసి, రాత్రి శైవతీర్థమో, తులసీ తీర్థమో మాత్రమే తీసుకోవాలి.
నక్తం: పగలు అంతా ఉపవాసం ఉండి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం లేదా అల్పాహారం స్వీకరించాలి.
అయాచితం: భోజనం కోసం ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం.
స్నానం: శక్తిలేని వాళ్లు సమంతరం స్నానం, జపాలు చేసినా చాలు.
మంత్ర, జపవిధులు కూడా తెలియనివాళ్లు కార్తీక సోమవారం రోజున నువ్వులను దానం చేసినా సరిపోతుంది.
పైన పేర్కొన్న వాటిల్లో ఏది చేసినా సోమవారవ్రతం చేసినట్లే అవుతుంది. కుమారస్వామిని కృత్తికలు పెంచడం వల్ల వారి పేరుతొ ఉన్న కార్తీకమాసం అంటే పరమశివుడికి మహాప్రీతి. గరళకంఠుడి తమోగుణం స్వభావాన్ని చంద్రుడు మాత్రమే హరించగలడు.. కాబట్టి కార్తీకంలో సోమవారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఉద్యోగం, శ్రామికులు, కర్షకులు ఇలా అనేకరకాలైన పనులు చేస్తూ ఉపవాస దీక్ష చేయలేనివారు ప్రాతఃకాలంలో స్నానం చేసి శివారాధన, దీపం పెట్టుకోవడం చేయాలి. అనంతరం సోమవారం మొత్తం మనసులో శివపంచాక్షరి, శివనామస్మరణ చేస్తే తప్పక శివానుగ్రహం కలుగుతుంది.