Ratha Saptami: రథసప్తమి తర్వాత నుంచి.. ఈ రాశులకు వరుసగా శుభవార్తలు..!

ఈ నెల 25న వచ్చే రథ సప్తమి నుంచి సూర్య భగవానుడి శక్తి మరింత ఉద్ధృతంగా మారనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఫిబ్రవరి 13 వరకూ కొనసాగే ఈ ప్రత్యేక కాలంలో సూర్యుడి గతి వేగం పెరగడంతో పాటు, కొన్ని రాశుల జీవితాల్లో కీలకమైన మార్పులు చోటు చేసుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటున్నారు. ముఖ్యంగా రథ సప్తమి రోజున ఆదిత్య హృదయం లేదా సూర్య స్తోత్రం పఠించే వారికి అదృష్ట ద్వారాలు మరింతగా తెరుచుకుంటాయని విశ్లేషిస్తున్నారు.

ఈ సూర్య బల ప్రభావం వల్ల మేషం, వృషభం, తుల, వృశ్చికం, ధనుస్సు, మీన రాశుల వారికి మహర్దశ ప్రారంభమయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆరోగ్యం, ఆదాయం, ఉద్యోగం, అధికారం, తండ్రికి సంబంధించిన విషయాలు, ప్రభుత్వ అనుకూలత వంటి అంశాల్లో ఈ రాశుల వారు ఊహించని శుభ ఫలితాలు అనుభవించనున్నారని చెబుతున్నారు.

మేష రాశివారికి ఈ కాలం కెరీర్ పరంగా టర్నింగ్ పాయింట్‌గా మారనుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరగడంతో పాటు అధికార యోగం బలపడుతుంది. ఆదాయం స్పష్టంగా వృద్ధి చెందుతుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, రాజకీయంగా ప్రాభవం, తండ్రి వైపు నుంచి ఆస్తి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వృషభ రాశివారికి భాగ్యయోగం పుష్కలంగా పనిచేస్తుంది. విదేశీ అవకాశాలు ఉద్యోగం, వ్యాపారం, విద్య రంగాల్లో అందుబాటులోకి వస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు తగ్గి, ఆకస్మిక ధనలాభం, సంతాన యోగం కూడా కలసివచ్చే సూచనలు ఉన్నాయి.

తుల రాశివారికి రథ సప్తమి తర్వాత జీవితం మరింత సౌకర్యవంతంగా మారనుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానం, అనేక మార్గాల నుంచి ఆదాయం, కుటుంబంలో ఆనందం పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. వృశ్చిక రాశివారికి కెరీర్‌లో ఊహించని వేగం కనిపిస్తుంది. చేపట్టిన ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు, ఉద్యోగస్తులకు శీఘ్ర ప్రమోషన్లు లభిస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ ఉద్యోగ లేదా వ్యాపార అవకాశాలు కూడా ముందుకు వస్తాయి.

ధనుస్సు రాశివారికి ఆదాయం స్థిరంగా పెరుగుతుంది. ఆర్థిక ఒత్తిడులు తగ్గి, వ్యక్తిగత సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. పిత్రార్జితం లభించే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు, వృత్తి నిపుణులకు విదేశీ సంపాదన యోగం బలంగా కనిపిస్తోంది. మీన రాశివారికి ఈ కాలం నిజమైన రిలీఫ్ పీరియడ్‌గా మారనుంది. దీర్ఘకాలంగా వేధిస్తున్న దోషాలు, అడ్డంకులు తొలగిపోతాయి. ఆరోగ్యం, ఆదాయం రెండింట్లోనూ స్పష్టమైన మెరుగుదల కనిపిస్తుంది. శత్రువులే సహాయకులుగా మారుతారు. ఉద్యోగంలో వేగంగా ఎదుగుదల, వ్యాపారాల్లో కొత్త ఉత్సాహం వస్తుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశాలు ఉన్నాయి.

మొత్తంగా రథ సప్తమి సూర్య భగవానుడి ప్రత్యేక కృపను ప్రసాదించే పవిత్ర సమయంగా మారనుంది. ఈ రోజున భక్తిశ్రద్ధలతో సూర్యుని ఆరాధిస్తే, జీవితంలో వెలుగులు మరింత పెరుగుతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.