Gudivada : వైసీపీకి గుడివాడ మచ్చ: చెరిపేస్తే, చెరిగిపోదులే.!

Gudivada : గుడివాడలో కాసినో జరిగిందా.? లేదా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ‘అస్సలు జరగలేదు..’ అన్నది అధికార వైసీపీ వాదన. మంత్రి కొడాలి నాని కనుసన్నల్లోనే కాసినో నడిచిందనీ, దీని విలువ ఏకంగా 500 కోట్లు అనీ ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అందుకు సంబంధించి ఆధారాలంటూ కొన్ని వీడియోల్ని కూడా మీడియా ముందుంచింది టీడీపీ.

సరే, రాజకీయాల్లో ఇలాంటి ఆరోపణలు సహజమేననుకోండి.. అది వేరే సంగతి. నిజనిర్ధారణ పేరుతో టీడీపీ చేసిన హంగామా, దానికి వైసీపీ ఇచ్చిన కౌంటర్ ఎటాక్ వెరసి.. గుడివాడ కేంద్రంగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. మంత్రి కొడాలి నాని సీన్‌లోకి వచ్చి బూతుల దండకం అందుకున్నారు రాజకీయ ప్రత్యర్థుల మీద. మరీ ముఖ్యంగా చంద్రబాబుని కొడాలి నాని తూలనాడుతున్న వైనం, వైసీపీకి చాలా చాలా చెడ్డపేరు తెస్తోంది.

‘ఈయన్ని వైసీపీ నేతగా కొనసాగించడం వైసీపీకే ప్రమాదకరం..’ అన్న భావన వైసీపీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. కానీ, టీడీపీని కంట్రోల్‌లో వుంచాలంటే కొడాలి నాని మాత్రమే రైట్ పర్సన్.. అని అధికార వైసీపీ భావిస్తున్నట్టుంది.. అందుకే, తిట్ల దండకం విషయంలో కొడాలి నానికి పూర్తి స్వేచ్ఛ పార్టీ అధిష్టానం నుంచి లభిస్తోంది.

కాగా, ‘మహిళలతో అసభ్య నృత్యాలు చేయిస్తున్నట్లు నాకు సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులకు ఆ సమాచారాన్ని చేరవేయించి, వాటిని ఆపేయించాను..’ అని కొడాలి నాని గుడివాడ కాసినో వ్యవహారంపై వ్యాఖ్యానించడం వివాదాస్పదమయ్యింది.

అసలు కాసినో జరగలేదనీ, అమ్మాయిలతో అసభ్య నృత్యాలు ఎక్కడా చేయించలేదని చెప్పిన కొడాలి నాని, పోలీసులతో వాటిని ఆపేయించానని ఎలా చెబుతారు.? అన్నది టీడీపీ పైకి తెస్తోన్న లాజికల్ ప్రశ్న. సో, కొడాలి నాని అడ్డంగా బుక్కయిపోయినట్లే.

ఇదిలా వుంటే, గత కొద్ది రోజులుగా ఏదో ఒక రూపంలో గుడివాడ రాష్ట్రంలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అవుతోంది. అన్నీ కొడాలి నాని చుట్టూ పేరుకుపోతున్న వివాదాలే. రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయివి. ఒకరకంగా ఇవన్నీ అధికార వైసీపీకి చెరుపుకోలేని మచ్చల్లాంటివేనని చెప్పొచ్చేమో.!