Gudivada Gooduputani : గుడివాడ గూడు పుఠానీ వెనుక అసలేం జరిగింది.?

Gudivada Gooduputani : టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై దుమ్మత్తిపోయడం మంత్రి కొడాలి నానికి కొత్తేమీ కాదు. అసలాయన విమర్శల్ని, ఆయన తిట్టే బూతుల్ని జనం పట్టించుకోవడమే మానేశారు. సోషల్ మీడియాలో వైసీపీ మద్దతుదారులు కూడా కొడాలి వ్యాఖ్యలను ఒకప్పుడు గట్టిగా సర్క్యులేట్ చేసేవారుగానీ, ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారు.

కొద్ది రోజుల క్రితం కోవిడ్ బారిన పడ్డ కొడాలి నాని, ప్రస్తుతం కోలుకున్నారు. తాజాగా మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యారు. ఇదిలా వుంటే, ఇటీవల.. అంటే సంక్రాంతి నేపథ్యంలో గుడివాడలో ‘కాసినో’ నిర్వహణ పెద్ద దుమారమే రేపింది. ఎంట్రీ ఫీజు కింద 10 వేల రూపాయలు కట్టించుకున్న నిర్వాహకులు, లక్షల్లో కాదు.. కోట్లల్లో దండేసుకున్నారు.

ఎక్కడెక్కడినుంచో అమ్మాయిల్ని, మహిళల్ని రప్పించి.. నానా రకాల వేషాలూ వేయించారు. ఆ కాసినోలో నడిచిన దరిద్రాలు అన్నీ ఇన్నీ కావు. ఈ వ్యవహారానికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలోనూ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ దర్శనమిస్తున్నాయి. ఆ వీడియోల్లో కనిపిస్తున్నవారిని పట్టుకుని, అసలు విషయాన్ని కక్కించాల్సిన పోలీసులు, ఇంకా ఆ పని ఎందుకు చేయలేదన్నది చర్చనీయాంశంగా మారింది.

కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ సెంటర్‌లోనే ఇదంతా జరిగిందనేది టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా ఆరోపణ. తూచ్, అదంతా ఉత్తదే.. అలాగని నిరూపిస్తే, పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటా.. రాజకీయాల నుంచి తప్పుకుంటా.. అంటున్నారు కొడాలి నాని.

మంత్రి గారి సొంత నియోజకవర్గంలో కాసినో నిర్వహణ అంటే, చిన్న విషయం కాదు. ‘సంక్రాంతి నేపథ్యంలో అన్ని చోట్లా కోడి పందాలు, ఇతర వ్యవహారాలు నడిచినట్లే గుడివాడలో కూడా నడిచాయ్..’ అని మంత్రి కొడాలి నాని చెప్పడం పూర్తిగా బాధ్యతారాహిత్యం. చంద్రబాబుని తిట్టడం తన జన్మహక్కు.. అన్నట్టుగా కొడాలి వ్యవహరిస్తున్నారుగానీ.. అది వైసీపీకి చేటు చేస్తోందన్న విషయాన్ని మంత్రిగారు విస్మరిస్తున్నారు.

అన్నట్టు, నిజనిర్ధారణ కోసం వెళ్ళిన టీడీపీకి గుడివాడలో స్థానిక వైసీపీ నేతల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. పోలీసులు సైతం టీడీపీ నిజనిర్ధారణ కమిటీకి అడ్డుతగలిగారు. దాంతో, గుడివాడ గూడు పుఠానీ.. గుట్టు వీడటం కష్టమేనన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.