గుడ్ ల‌క్ ‘స‌ఖి’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన ‘మహానటి’

మహానటి ఫేం కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం గుడ్ ల‌క్ ‘స‌ఖి’ . కీర్తి సురేష్ గత కొన్ని రోజులుగా వరుసగా మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే నటిస్తున్నారు. పెంగ్విన్, మిస్ ఇండియా, ఇప్పుడు గుడ్ ల‌క్ స‌ఖి ఆ కోవ‌లోకే వ‌స్తాయి. పెంగ్విన్, మిస్ ఇండియా చిత్రాలు క‌రోనా స‌మ‌యంలో ఓటీటీలో విడుద‌ల కాగా, తాజాగా గుడ్ ల‌క్ స‌ఖి చిత్రం రిలీజ్ డేట్ ప్ర‌క‌టించారు. జూన్ 3న ఈ చిత్రం తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళంలో విడుద‌ల కానుంది.

నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ “గుడ్ లక్ సఖి” సినిమాకి శ్రావ్య వర్మ సహా నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పాడిరి గుడ్ ల‌క్ స‌ఖి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. మంచి ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మరోవైపు కీర్తి స్టార్ హీరోల స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తూ అశేష అభిమానాన్ని పెంచుకుంటుంది. నితిన్ స‌ర‌స‌న రంగ్ దే అనే చిత్రంతో కీర్తి న‌టించ‌గా, ఈ చిత్రం మార్చి 26న రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఈ సినిమాపై ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక మ‌హేష్ బాబు స‌ర‌స‌న కూడా కీర్తి సురేష్ న‌టిస్తుంది. స‌ర్కారు వారి పాట టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ప‌ర‌శురాం తెర‌కెక్కిస్తున్నాడు. దుబాయ్‌లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర బృందం త్వ‌ర‌లో గోవాకు వెళ్ల‌నుంది. అక్క‌డ మ‌హేష్, కీర్తిసురేష్‌ల‌పై సాంగ్స్ చిత్రీక‌రించ‌నున్న‌ట్టు స‌మాచారం.