గులాబీ మంత్రి కాస్తా బీజేపీ ఎమ్మెల్యే అయ్యారు. ఆయనే ఈటెల రాజేందర్. ఇటీవల జరిగిన హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించిన ఈటెల రాజేందర్, ఎమ్మల్యేగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వరుసగా పెట్టిన రెండు ప్రెస్ మీట్లు చూసి జనం నవ్వుకున్నారంటూ ఈటెల సంచలన వ్యాఖ్యలు చేశారు. పెట్రో ధరలపైనా, వరి పంట విషయంలోనూ సీఎం కేసీయార్ చిత్తశుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారన్నది ఈటెల సహా బీజేపీ నేతల వాదన.
అయితే, కేంద్రాన్ని ఈ రెండు విషయాలపైనా కేసీయార్ కడిగి పారేశారని గులాబీ శ్రేణులు భావిస్తున్న సంగతి తెలిసిందే. కేసీయార్ బ్యాక్ టు బ్యాక్ పెట్టిన ప్రెస్ మీట్లతో ఈక్వేషన్ ఒక్కసారిగా మారిపోయిందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
కానీ, ఈటెల రాజేందర్ మాత్రం కేసీయార్ ప్రెస్ మీట్లు నవ్వులపాలైపోయాయని చెబుతున్నారు. కేసీయార్ తన మంత్రి వర్గం నుంచి ఈటెల రాజేందర్‌ని తొలగించాక, తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలే కనిపించాయి. ఈటెలను ఓడించేందుకు కేసీయార్ అండ్ టీమ్ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.
అయితే, తాను రాజీనామా చేసిన స్థానాన్ని ఈటెల రాజేందర్ నిలబెట్టుకోవడం ద్వారా నేరుగా కేసీయార్ మీదనే విజయాన్ని సాధించానన్న నమ్మకంతో వున్నారు ఈటెల. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే ప్రచారం కూడా వుంది.