కరోనా వైరస్ కారణంగా ప్రజలలో ఈ మధ్య ఆరోగ్యం, రోగనిరోధక శక్తి మీద అవగాహన పెరిగి ఫ్రూట్స్ వాడకం చాలా ఎక్కువైంది. ఈ క్రమంలోనే ‘డ్రాగన్ ఫ్రూట్’ ప్రాధాన్యత వాణిజ్యపరంగా బాగా పెరిగింది. ఎందుకంటే ఈ పండులో మన శరీరానికి కావాల్సిన అనేక పోషకాలున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ ను ‘పిటాయా’ అని కూడా పిలుస్తారు. ఈ పండు రుచి కివీ, పైనాపిల్ లను పోలి ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రాగన్ ఫ్రూట్ లో ‘సి’ విటమిన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తుంది. దంతాలు, చిగుళ్ల సమస్యలు పోతాయి. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. వీటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను పోగొడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి.
డ్రాగన్ ఫ్రూట్ లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగానే ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. దీంతో క్యాన్సర్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండవచ్చు. రక్త సరఫరా మెరుగుపడి బీపీ కంట్రోల్ లో ఉంటుంది. పొటాషియం ఎక్కువగా ఉన్నందున హార్ట్ ఎటాక్ లాంటి గుండె సమస్యలు తక్కువగా ఎదురవుతాయి.
డ్రాగన్ ఫ్రూట్ పేస్ట్ గా చేసుకుని అందులో తేనె కలుపుకుని ఫేస్ ప్యాక్ లా వేసుకుంటే చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావు. డ్రాగన్ ఫ్రూట్స్ తినడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఇలాంటి అద్భుతమైన లక్షణాలున్న డ్రాగన్ ఫ్రూట్ ను ఆహారంలో భాగంగా చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోండి.