ఒకప్పుడు మతిమరుపు అనేది వృద్ధుల సమస్యగా మాత్రమే భావించేవాళ్లం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాలేజీ విద్యార్థులు, ఉద్యోగ యువత కూడా చిన్న చిన్న విషయాలు మర్చిపోతూ ఇబ్బంది పడుతున్నారు. మొబైల్ ఎక్కడ పెట్టామో గుర్తు లేకపోవడం, ఇప్పుడే మాట్లాడిన విషయాన్ని మళ్లీ అడగడం, పని మీద దృష్టి నిలపలేకపోవడం.. ఇవన్నీ సాధారణమైపోతున్నాయి. వైద్య నిపుణులు దీనికి ‘బ్రెయిన్ ఫాగ్’ అనే పేరు పెడుతున్నారు.
బ్రెయిన్ ఫాగ్ అనేది వ్యాధి కంటే ఒక హెచ్చరిక అని నిపుణులు చెబుతున్నారు. మెదడు స్పష్టంగా పనిచేయకపోవడం, ఆలోచనలు గందరగోళంగా మారడం, సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టడం దీని లక్షణాలు. ముఖ్యంగా ఒత్తిడి, నిరంతర అలసట, అవాంఛిత ఆలోచనలు ఈ సమస్యను మరింత పెంచుతున్నాయి. ఫలితంగా జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు యువతను ఎక్కువగా వేధిస్తున్నాయి.
ప్రస్తుత జీవనశైలే దీనికి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. గంటల తరబడి స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌ల ముందు గడపడం వల్ల నిద్ర చక్రం పూర్తిగా దెబ్బతింటోంది. నిద్రలేమి కారణంగా హార్మోన్ల సమతుల్యత చెడిపోతుంది. ఇది మెదడుపై ప్రత్యక్ష ప్రభావం చూపించి బ్రెయిన్ ఫాగ్‌కు దారితీస్తోంది. నిర్లక్ష్యం చేస్తే, దీర్ఘకాలంలో ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలకు కూడా ఇది కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు.
బ్రెయిన్ ఫాగ్ ప్రభావం శరీరానికి మాత్రమే కాదు, మనస్సుకూ పడుతుంది. తరచూ తలనొప్పి, బలహీనత, ఎప్పుడూ అలసటగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చిన్న విషయాలకే చిరాకు రావడం, మాట్లాడేటప్పుడు మాటలు తడబడటం కూడా కొంతమందిలో కనిపిస్తోంది. దీంతో వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన పనితీరుపై కూడా ప్రభావం పడుతోంది.
అయితే ఈ సమస్యను తొలిదశలోనే నియంత్రించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. డిజిటల్ పరికరాల వాడకానికి పరిమితి విధించుకోవడం, ప్రతి పనికి ఒక నిర్దిష్ట సమయం కేటాయించుకోవడం ఎంతో ముఖ్యం. సమతుల్య ఆహారం, తగినంత నిద్ర మెదడుకు తిరిగి శక్తిని అందిస్తాయి. అలాగే రోజూ కొద్దిసేపైనా విశ్రాంతి తీసుకోవడం, ఆలోచనలను కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో పంచుకోవడం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మొత్తానికి తరచూ మర్చిపోతున్నామా? ఏ పనిపైనా దృష్టి నిలవడం లేదా? అని అనిపిస్తే దాన్ని తేలికగా తీసుకోవద్దు. అది బ్రెయిన్ ఫాగ్ కావచ్చు. జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకుంటే, మెదడును మళ్లీ చురుకుగా మార్చుకోవచ్చు. ఇప్పుడే జాగ్రత్త పడితే భవిష్యత్తులో పెద్ద సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.
