ఉదయం లేస్తూనే చాలా మందికి మొదటి గుర్తొచ్చేది టీ లేదా కాఫీ. వంటింట్లోకి అడుగుపెట్టి వేడివేడిగా కప్పు కాఫీ లేదా టీ తాగాకే వారికి రోజు మొదలవుతుంది. ఈ అలవాటు చిన్నది అనిపించినా.. దీనిపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏ పానీయం ఎప్పుడు తాగితే, ఎంతసేపు మరిగిస్తే శరీరానికి మేలు జరుగుతుందో శాస్త్రవేత్తలు ఒక్కొక్కటిగా వివరాలు చెబుతున్నారు. ఈ కథనంలో దాని గురించి తెలుసుకుందాం.
టీ విషయానికి వస్తే, రోజుకు రెండు నుంచి నాలుగు కప్పుల టీ తాగితే ధమనులు బలంగా ఉంటాయని.. ఫలితంగా గుండె జబ్బులు, మతిమరపు సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒక కప్పు టీ తాగినా డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందనీ.. మూడు కప్పులు తాగితే జీవితకాలం పెరిగే అవకాశం ఉందని కూడా అధ్యయనాలు వెల్లడించాయి. ఇక గ్రీన్ టీ, బ్లాక్ టీ, వైట్ టీలా ఏ రకమైన టీలోనూ యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండి శరీరానికి మేలు చేస్తాయి. అయితే, మరిగించే సమయాన్ని బట్టి పోషకాలు మారుతాయి. బ్లాక్ టీని ఐదు నిమిషాల వరకు మరిగిస్తే అధిక యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయని, కానీ గ్రీన్ టీని ఎక్కువసేపు ఉంచితే దాని గుణాలు తగ్గిపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
అదే సమయంలో కాఫీకి విషయానికి వస్తే.. హార్వర్డ్, ట్యులేన్ యూనివర్సిటీల పరిశోధనల ప్రకారం కాఫీని ఉదయం తాగితేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందట. శరీరంలో మార్నింగ్ టైమ్‌లో ఇన్‌ఫ్లమేషన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో కాఫీలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ రసాయనాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. రెండు నుంచి మూడు కప్పుల కాఫీ తాగే వాళ్లలో గుండె జబ్బులు, మరణాల ప్రమాదం తక్కువగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కాఫీ తాగే వాళ్లలో లివర్‌కు సంబంధించిన సమస్యలు తగ్గడం, కొన్ని రకాల కాన్సర్ల ప్రమాదం తగ్గడం కూడా రీసెర్చ్‌లలో బయటపడింది. అయితే, అధికంగా కాఫీ లేదా టీ తాగితే నిద్రలేమి, ఆమ్లత్వం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే పరిమిత మోతాదులో మాత్రమే ఈ పానీయాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
రోజువారీ జీవితంలో టీ, కాఫీ మనల్ని అలెర్ట్‌గా ఉంచే పానీయాలే అయినా, వాటి తయారీ విధానం, సమయం, మోతాదు అన్నీ శరీరానికి ఎలా మేలు చేస్తాయో నిర్ణయిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి, ఇకపై కప్పు టీ లేదా కాఫీ తాగేటప్పుడు, కేవలం అలవాటు కోసమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల కోసమేనని గుర్తుంచుకోవాలి. (గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పరిశోధనలు, అధ్యయనాల ఆధారంగా మాత్రమే. వ్యక్తిగత వైద్య సలహా కోసం తప్పనిసరిగా నిపుణులను సంప్రదించండి.)
