వాకింగ్ చేసే సమయంలో ఫోన్ వాడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందింది..దీనివల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ దుష్పరిణామాలు కూడా చాలానే ఉన్నాయి. ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అని వయసు వ్యత్యాసం లేకుండా చిన్న పిల్లల నుండి ముసలివారి వరకు స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిపోయింది. ఉదయం లేచింది మొదలు తిండి నిద్ర మానేసి మరి చాలామంది స్మార్ట్ ఫోన్ జీవితంగా బతికేస్తున్నారు. అతిగా స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల చాలా దుష్పరిణామాలు తలెత్తుతాయి.

ప్రస్తుతం చాలామందికి ఆరోగ్యం కోసం ఉదయం , సాయంత్రం వాకింగ్ చేయడం అలవాటైపోయింది.. కానీ వాకింగ్ చేసే సమయంలో మొబైల్ వాడకం కూడా ఎక్కువైపోయింది. అలా స్మార్ట్ ఫోన్ వాడుతూ వాకింగ్ చేయటం వల్ల ఆరోగ్యం మెరుగుపడటం అటుంచితే అనారోగ్య సమస్యలు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. వాకింగ్ చేసే సమయంలో మొబైల్ వాడటం వల్ల కలిగే సమస్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రతి రోజు వాకింగ్ చేయడం వల్ల శరీర అవయవాలు బాగా పని చేస్తాయి.. మెదడు చురుకుగా పనిచేస్తుంది. కానీ వాకింగ్ చేసే సమయంలో ఫోన్ చూస్తూ నడవటం వల్ల మెడనొప్పి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం సెల్ ఫోన్ వాడకం అలవాటుగా కాకుండా వ్యసనంగా మారిపోయింది.

వాకింగ్ చేసే సమయంలో సెల్ ఫోన్ చూస్తూ వంగి నడవటం వలన వెన్నెముక దెబ్బతిని దాని వలన బ్యాక్ పెయిన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఎక్కువ సమయం మొబైల్ ఫోన్ చూస్తూ నడవటం వలన కండరాల నొప్పులు మొదలవుతాయి. వాకింగ్ చేసే సమయంలో మొబైల్ చూడటానికి వంగి నడవటం వలన శరీరాకృతిలో మార్పులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.. కనుక వాకింగ్ చేసే సమయంలో
మొబైల్ ఫోన్ ఉపయోగించటం చాలా సమస్యలకు దారి తీస్తుంది.