ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మాట పదే పదే వినిపిస్తుంది. రేపు తప్పకుండా జిమ్‌కి వెళ్లాలి.. ఇక నుంచి వాకింగ్ స్టార్ట్ చేయాలి అని. కానీ ఆ రేపు చాలా సార్లు రాదు. ఉదయం నిద్రలేమి, చలి వాతావరణం, ఆఫీస్ పనులు, కుటుంబ బాధ్యతలు.. ఇలా కారణాలు మారుతుంటాయి కానీ ఫిట్‌నెస్ మాత్రం మొదలుకాదు. అలాంటి వారికి ఇప్పుడు నిపుణులు సూచిస్తున్న ఒక సులభమైన పరిష్కారం ఉంది. అదే క్విక్ వాక్.
ఇది సాధారణంగా నడిచే నడక కాదు. నిజంగా ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే ఒక నిర్దిష్ట వేగం, ఒక క్రమం తప్పనిసరి. రోజుకు కేవలం 30 నిమిషాలు, గంటకు సుమారు 5 కిలోమీటర్ల వేగంతో నడిస్తే చాలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ వేగం శరీరానికి సరైన ఉత్సాహాన్ని ఇస్తుంది. గుండె స్పందనను ఆరోగ్యకర స్థాయికి తీసుకెళ్తుంది. శరీరం కొవ్వు తగ్గడం మొదలుపెడుతుంది.
చాలా మంది నేను రోజంతా నడుస్తూనే ఉంటాను అంటారు. కానీ ఇంటి పనులు, ఆఫీస్‌లో తిరగడం లేదా దుకాణానికి వెళ్లడం ఫిట్‌నెస్ వాకింగ్‌గా పరిగణించబడదు. ఫిట్‌నెస్ నడక అంటే కొంచెం వేగంగా, ఆగకుండా, లోతైన శ్వాసతో నడవడం. శరీరం వెడెక్కేలా, చెమట వచ్చేలా నడిచినప్పుడే దాని ప్రభావం కనిపిస్తుంది.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం స్థిరత్వం. నడుస్తూ పదే పదే ఆగిపోతే, ఫోన్ చూసుకుంటే, ఎవరితోనైనా మాట్లాడితే లేదా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎక్కువసేపు నిలబడితే శరీరానికి వచ్చిన రిథమ్ తెగిపోతుంది. అప్పుడు వ్యాయామ ప్రభావం తగ్గిపోతుంది. 30 నిమిషాలు నిరంతరంగా కదలడం వల్ల గుండె, ఊపిరితిత్తులు, కండరాలు ఒకే లయలో పనిచేస్తాయి. అదే నిజమైన ఫిట్‌నెస్ ఫలితాలను ఇస్తుంది.
మీ వేగం సరైందో కాదో తెలుసుకోవడం కూడా చాలా సులభం. 30 నిమిషాల్లో మీరు సుమారు 2.5 కిలోమీటర్లు నడవగలిగితే, మీరు సరైన దిశలో ఉన్నట్టే. ఈ వేగంతో ఐదు నుంచి పది నిమిషాల్లోనే శరీరం చురుగ్గా అనిపించడం ప్రారంభిస్తుంది. ఇక దీనితో పాటు నడవడానికి సరైన స్థలం, సరైన సమయం ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ప్రతి రెండు నిమిషాలకు ఆగాల్సిన చోట నడిస్తే, మీ వేగం నిలబడిపోతుంది. అందుకే పార్క్, కాలనీలోని ప్రశాంతమైన రోడ్ లేదా పొడవైన కాలిబాట లాంటి ప్రదేశాలను ఎంచుకోవాలి. ట్రాఫిక్ తక్కువగా ఉండే ఉదయం లేదా సాయంత్రం సమయాన్ని అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి నడవడం మొదలుపెడితే, అది క్రమంగా దినచర్యలో భాగమైపోతుంది. అప్పుడు సాకులకు చోటు ఉండదు.
నడుస్తున్న సమయంలో మొబైల్‌ను దూరంగా పెట్టడం అత్యంత అవసరం. ప్రతి నోటిఫికేషన్‌కి ఆగిపోవడం వల్ల మీ కృషి వృథా అవుతుంది. ఫోన్‌ను సైలెంట్‌లో పెట్టి, సమయం చూడటానికి వాచ్ లేదా ఫిట్‌నెస్ బ్యాండ్ ఉపయోగించాలి. ఈ 30 నిమిషాలు పూర్తిగా మీ శరీరం, మీ మనసుకు అంకితం కావాలి. జిమ్‌కి వెళ్లలేకపోతున్న వారికి చురుకైన నడక ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. ఇది గుండెను బలపరుస్తుంది. బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ముఖ్యంగా ఇది ఉచితం, సులభం, ఎక్కడైనా చేయవచ్చు. జిమ్ మెంబర్‌షిప్‌లకన్నా ముందు, ఒక్కసారి ఈ నడకను మీ జీవితంలోకి తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు.
