రాష్ర్టంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోన్న సంగతి తెలిసిందే. ఎక్కడికక్కడే మహమ్మారి వ్యాపిస్తోంది. వైరస్ ని అరికట్టడానికి ఎన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకున్నా మహమ్మారిని అదుపు చేయడం రోజు రోజుకి మరీ కష్టంగా మారిపోతుంది. ప్రభుత్వంలో దాదాపు అన్ని శాఖలను కరోనా చుట్టేసింది. తాజాగా జైళ్లకు కరోనా అంటుకుంది. వందలాది మంది ఉండే జైళ్లకు కరోనా అంటుకోవడంతో జాగ్రత్తలు తీసుకోవడం కష్ట తరంగా మారింది. కొత్త ఖైదీలు అరెస్ట్ అయిన నేపథ్యంలో వాళ్లను అన్ని పరీక్షలు నిర్వహించి జైళ్లకు తరలించిన తర్వాత కొద్ది రోజులకే మహమ్మారి బారిన పడటంతో మిగతా ఖైదీలకు సోకుతుంది.
దీంతో అరికట్టడం అధికారులకు తలకు మించిన భారం అవుతోంది. తాజాగా ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జైళ్ల శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ర్టగంలో ఏకంగా 13 చోట్ల ఏకంగా కరోనా జైళ్లనే ఏర్పాటు చేసింది. అంటే బయట నుంచి కొత్తగా వచ్చిన ఖైదీలందర్నీ కరోనా పరీక్షలు నిర్వహించి ఆ జైళ్లకు తరలిస్తారు. ఆ తర్వాత నెల రోజుల పాటు వాళ్లందర్నీ అబ్జర్వేషన్ లో ఉంచి మళ్లీ పరీక్షలు నిర్వహించి అప్పుడు నెగిటివ్ వస్తే సాధారణ జైళ్లకు తరలిస్తారు. దీనిలో భాగంగా రాష్ర్టంలో శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, భీమవరం, మచిలీపట్నం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, డోన్, గుత్తి, పీలేరు, కావలి మార్కాపురం తదితర ప్రాంతాల్లో ఈ కొత్త జైళ్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ జైళ్ల నుంచి ఖైదీలు తప్పించుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇక కరోనా పరీక్షలకు సంబంధించి ప్రత్యేకంగా సిబ్బందిని, డాక్టర్లను అపాయింట్ చేస్తున్నారు. ఒక మెడికల్ అధికారి, పారా మెడికల్ అధికారి ఎప్పుడు ఆ జైళ్లలో ఉండాల్సిందే. అక్కడ పనిచేసే సిబ్బంది అందరూ ఎప్పుడూ విధుల్లో ఉన్నంత సేపు పీపీఈ కిట్లు ధరించి ఉండాలి. వీటన్నింటికి సంబంధించి ప్రభుత్వం జైళ్ల శాఖకు , అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.