సినిమా టిక్కెట్స్: కేసీయార్, జగన్‌లలో ఎవరు బెస్ట్.?

KCR Vs Ys Jagan : సినిమా టిక్కెట్ల వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమను వైఎస్ జగన్ సర్కారు దెబ్బ తీస్తోందన్న విమర్శలు, సినీ పరిశ్రమను కేసీయార్ సర్కారు ఆదుకుంటోందన్న ప్రశంసలు గతంలో వినిపించాయి. ఆ తర్వాత జగన్ సర్కారు కూడా సినీ పరిశ్రమకు మేలు చేస్తోందని సినిమా టిక్కెట్ల ధరలు పెరిగాక సినీ జనాలు చెప్పుకోవడం విన్నాం.

రోజులు గడుస్తున్నాయ్. పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయ్, బొక్క బోర్లా పడుతున్నాయ్. సినిమా థియేటర్లకు జనం రావడం తగ్గించేశారు. అంతా సినిమా టిక్కెట్ల ధరల ప్రభావమే. కొత్త సినిమాలు, పైగా పెద్ద సినిమాలకు అదనపు వడ్డన.. దాంతో, సినిమా అంటేనే సామాన్యుడు బెదిరిపోయి, చిరాకు పడే పరిస్థితి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. దాంతో, ‘వైఎస్ జగన్ సర్కారే నయ్యం.. టిక్కెట్ ధరల్ని తగ్గించి మంచి పని చేసింది. కానీ, పరిశ్రమ పెద్దలే టిక్కెట్ల ధరలు పెంచాలంటూ ఒత్తిడి చేసి, సినిమాని సామాన్యుడికి దూరం చేశారు..’ అన్న చర్చ ఏపీలో షురూ అయ్యింది.

తెలంగాణలోనూ ఇదే వాతావరణం కనిపిస్తోంది.

అయితే, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలకు టిక్కెట్ ధరలు పెరిగితే తప్పు లేదు. కానీ, ఓ మోస్తరు సినిమాలకు కూడా టిక్కెట్ ధరల్ని పెంచుకునే వెసులుబాటు ఇస్తే ఎలా.? తొలి వారం పది రోజులు పెంపుకి అనుమతిస్తున్నారు సరే, జనం లేనప్పుడు.. టిక్కెట్ ధరల్ని తగ్గిస్తారా.? అంటే అదీ లేదు. అప్పుడు సాధారణ ధరలుంటాయ్.

ఏదిఏమైనా, సినీ పరిశ్రమకు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం వుంది. రాను రాను జనం ఓటీటీకి అలవాటు పడిపోతున్నారు.

సినిమా ఫ్లాపయితే వారం పదిరోజుల్లో ఓటీటీలో వచ్చేస్తుందన్న నమ్మకం జనంలో పెరిగిన దరిమిలా.. పరిశ్రమ ఇకపై ఓటీటీ ఆధారిత సినిమాలు తీసుకోవడం బెటర్.