భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. కానీ కేంద్ర నాయకత్వం నుండి అందిన ఆదేశాలతో ఆయన్ను దగ్గరకు కూడా రానివ్వట్లేదు ఏపీ బీజేపీ శాఖ. పొత్తు అంటేనే పొమ్మంటున్నారు. ఎటువైపు నుండి నరుక్కువద్దామన్నా ఎవరో ఒకరు అడ్డుపుల్ల వేస్తున్నారు. జీవీఎల్ నరసింహారావు, సునీల్ ధియోధర్ లాంటి వాళ్ళు బాబుగారి ఆటలను సాగనివ్వట్లేదు. మోడీ అయినా కరిగేలా ఉన్నారు కానీ వీరిద్దరూ మాత్రం కాంప్రమైజ్ అయ్యేలా కనిపించట్లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆయనకు తెలంగాణ బీజేపీ ఆశాకిరణంలా కనబడుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన కమలం పార్టీ గ్రేటర్ ఎన్నికల్లోనూ సత్తా చూపాలని అనుకుంటోంది.
ఈ ఊపులో కొత్త శక్తులను కోడగట్టుకోవాలనే ఆలోచన కూడ ఉంది వారిలో. అందుకే కొన్నిరోజుల ముందుగానే పవన్ కళ్యాణ్ ను గ్రేటర్ బరిలోకి దిగేందుకు సిద్ధంచేసి పెట్టుకున్నారు. ఇది మంచి అవకాశంగా కనిపిస్తోంది చంద్రబాబుకు. ఇప్పుడు గనుక తెలంగాణలో బీజేపీ కదిలిస్తే కేసీఆర్ మీద పైచేయి సాధించడానికైనా పొత్తుకు ఒకే చెప్పే అవకాశం ఉంటుందనేది ఆయన ఆలోచన. నిజానికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సరైన నాయకత్వం లేదు కానీ మంచి కేడర్ అయితే ఉంది. కాస్తో కూస్తో ఓటు బ్యాంక్ ఉంది. వీటిని చూపించి బీజేపీ పెద్ద బండి సంజయ్ ను ప్రభావితం చేయాలని అనుకుంటున్నారు.
ఒకవేళ అన్నీ కలిసొచ్చి బండి సంజయ్ పొత్తుకు ఒప్పుకుని గ్రేటర్ ఎన్నికల్లో కూటమి మంచి ఫలితాలను సాధిస్తే తెలుగుదేశం పార్టీతో కలవడం కలిసొస్తుందనే సంకేతాలు కేంద్ర నాయకత్వం వద్దకు వెళ్తాయి. అప్పుడు ఏపీలో వారితో చేతులు కలపడానికి మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు. చంద్రబాబు ఆలోచిస్తున్న ఈ పాజిబిలిటీ కష్టమైనదే అయినా అసాధ్యమైనది మాత్రం కాదు. కలిసొస్తుంది అనుకునే బీజేపీ వదిలిపెట్టదు. అందుకు చేయాల్సిందల్లా వారి నమ్మకాన్ని పొందడమే. అందుకున్న ఒకేఒక్క దారి తెలంగాణ బీజేపీని ముగ్గులోకి దింపడం. మరి బాబుగారి ప్లాన్ ప్రకారం బండి సంజయ్ స్నేహం హస్తం అందిస్తారేమో చూడాలి.