రాష్ట్ర రాజకీయాలకు, కేంద్ర రాజకీయాలకు మధ్యం సున్నితమైన సంబంధం ఉంటుంది. ఆ సంబంధం ఆరోగ్యకరంగా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. ఒకవేళ చెడిపోతే పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి. ఎలాఉన్నా బాగుండటమో, బాగోలేకపోవడమో ఏదో ఒకటి స్పష్టంగా ఉంటుంది. ఆ స్పష్టత స్థానిక పార్టీలకు, వాటి అధ్యక్షులకు చాలా ముఖ్యం. బాగుంటే చేయి చేయి కలిపి పరస్పర సహకారంతో నడుస్తారు. లేకపోతే ఢీకొట్టి పనులు జరుపుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ రెంటికీ మధ్యలో ఇరుక్కుపోయి ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. 2014 ఎన్నికలు, ఆ తరవాత మూడేళ్లపాటు బీజేపీతో సహవాసం చేశారు చంద్రబాబు. ఆ టైంలో ఆయనకు ఢిల్లీ రాజకీయాల పట్ల ఒక స్పష్టమైన కార్యాచరణ ఉండేది. విడిపోయి పక్క రాష్ట్రాలకు వెళ్లి విమర్శించినప్పుడు కూడ మోదీని అధికారం నుండి దించాలనే తపన కనబడింది.
అయితే ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు బీజేపీ తోడును కోరుకుంటున్నారు. అందుకే పోలవరం, హోదా, రాజధాని అంశాల్లో మోదీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయలేకున్నారు. అయినా కూడ బీజేపీ ఆయన్ను దూరం పెడుతోంది. పొత్తు అనే మాట వద్దనే వద్దని పొమ్మంటోంది. అయినా బాబుగారిలో తోడు కోసం తపన తగ్గలేదు. అందుకే బీజేపీ విషయంలో విమర్శలు చేయడం, పొగడ్తలు కురిపించడం చెయ్యట్లేదు. చంద్రబాబు పరిస్థితి ఇలా అడకత్తెరలో పోకచెక్కలా ఉంటే మిగతా తెలుగు లీడర్లు మాత్రం ఒకే దారిలో వెళుతూ రాజకీయం చేసేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదటి నుండి బీజేపీకి సౌమ్యుడిగానే ఉంటున్నారు. పోలవరం నిధులు, హోదా, ప్యాకేజీ నిధుల్లో ఆలస్యం జరుగుతున్నా మోదీని విమర్శించకుండా అవసరమైన రహస్య బంధాన్ని నడిపిస్తున్నారు. అందుకుగాను పొందాల్సిన ప్రయోజనాలు పొందుతున్నారు.
మరొక నేత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎలాగూ అధికారికంగా బీజేపీతో పొత్తులో ఉన్నారు. రాష్ట్ర నాయకులతో కేంద్ర నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఇప్పటికైతే వీరి మైత్రీ బంధం బలంగానే కనబడుతోంది. మొన్నామధ్యన పవన్ ఢిల్లీ కూడ వెళ్లివచ్చారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం తాజగా ఢిల్లీ పర్యటన చేసి సంచలనానికి దారితీశారు, ప్రాజెక్టులు, విమానాశ్రయాలు, వరద సహాయం లాంటి అంశాలతో పెద్దలను కలిసి అంతకుమించిన వ్యవహారాలనే చక్కబెట్టుకుని వచ్చారని వినికిడి. ఈ టూరు తెలంగాణ రాజకీయాల్లో మార్పులు తెస్తుందని అంటున్నారు. ఇక బండి సంజయ్ అంటారా బీజేపీ నాయకుడే కాబట్టి వారిదెప్పుడూ ఏకపక్షమైన, స్పష్టమైన మార్గమే.
ఇలా ముఖ్య నాయకులు అందరూ కేంద్రంతో ఏదో రకంగా సన్నిహితంగా ఉంటూనే ఉన్నారు. సమయానుకూలంగా కావలసిన పనులు జరువుకుంటూ పెద్ద కంగారు లేకుండా వెనుక పెద్ద కొండలాంటి అండ ఉండనే ధీమాతో ముందుకుపోతుంటే చంద్రబాబు మాత్రం ఆశగా ఢిల్లీ వైపు చూస్తూ మోదీ ప్రసన్నం కోసం ఎదురుచూస్తూ మీమాంసలో గడపాల్సి వస్తోంది. దీని మూలంగా ఆయన కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకోలేక అనేక విధాలుగా వెనకబడిపోతున్నారు.