వైఎస్ జగన్ మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడంట.?

సరిగ్గా రెండున్నరేళ్ళ తర్వాత మంత్రి వర్గంలో చాలా మార్పులుంటాయ్.. పాతవారిని దాదాపుగా తొలగించి, వీలైనంత ఎక్కువమంది కొత్తవారికి అవకాశం కల్పిస్తామన్నది ముఖ్యమంత్రి అవుతూనే పార్టీ ముఖ్య నేతలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ. మరి, ఆ హామీని వైఎస్ జగన్ ఎప్పుడు నిలబెట్టుకుంటారు.?

ప్రస్తుతానికైతే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఈ విషయంలో నిలదీసేంత సీన్ వైసీపీలో ఎవరికీ లేదు. కరోనా పరిస్థితులు, ఇతరత్రా సమస్యల కారణంగా కొత్త మంత్రి వర్గం.. అంటే అది కత్తి మీద సాములాంటి వ్యవహారమేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాగా తెలుసు.

పైగా, పార్టీలో ఆశావహులు ఎక్కువైపోయారు. వారందరినీ సంతృప్తి పరచడం అసాధ్యం. ఒకవేళ అసంతృప్తులు పెరిగిపోతే, పార్టీకి నష్టం కలుగుతుంది. అలాగని మంత్రి వర్గాన్ని మార్చకుండా వైఎస్ జగన్ ఎన్నాళ్ళు బండి నడపగలరు.? అన్నది ఇంకో చర్చ.

ఖచ్చితంగా మార్పులైతే వుంటాయ్. అది ఈ ఏడాదిలో వుండకపోవచ్చని వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అదే సమయంలో, పార్టీలో ఈ విషయమై తీవ్ర చర్చ గత కొంతకాలంగా జరుగుతున్న దరిమిలా, ఏ క్షణాన అయినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీపి కబురు చెప్పవచ్చునని ఆశావహులు ఎదురుచూస్తున్నారు.

ఆశావహులు.. అంటే, చాలామందే వుంటారు. ఎమ్మెల్యేలకే తప్ప, ఎమ్మెల్సీలకు మంత్రులుగా అవకాశం దక్కకపోవచ్చంటున్నారు. అదే సమయంలో, శాసన మండలి ఇప్పట్లో రద్దయ్యే అవకాశం లేదు గనుక, ఎమ్మెల్సీలకూ మంత్రి వర్గంలో చోటు వుండొచ్చనే ఆశాభవం పలువురు ఎమ్మెల్సీలలో వుంది.

ఏమో, ఏం జరుగుతుందోగానీ.. కొత్త మంత్రి వర్గం విషయమై విపక్షాలూ ఆశగా ఎదురు చూస్తున్నాయ్. ఎందుకంటే, అసంతృప్తుల్ని తమవైపుకు లాగేసుకోవచ్చు గనుక. ఎవరి గోల వారిది.