ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు శుభవార్త తెలియజేసింది. 2019 అక్టోబర్ 2వ తేదీ అమల్లోకి వచ్చిన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థకు మునిసిపాలిటీ, మునిసిపల్ కార్పొరేషన్ చట్టం తరహాలోనే సచివాలయ వ్యవస్థకు కూడా చట్ట రూపం వచ్చింది.రాజ్యాంగంలోని 11, 12 షెడ్యూళ్లలో పేర్కొన్న ప్రకారం ప్రజల కేంద్రంగా ప్రభుత్వ సేవలు, ఇతర సదుపాయాలను అందించేందుకు చట్టం ద్వారా గ్రామ/వార్డు సచివాలయాల పేరుతో వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నట్టు ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటుపై ప్రకటన చేశారు.2019 అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థ అధికారికంగా ప్రారంభమైంది
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేయగా..పట్టణ ప్రాంతాల్లో 4 వేల జనాభాకు ఒక సచివాలయం చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో 10 నుంచి 11 మంది వరకు శాశ్వత ఉద్యోగులను ప్రభుత్వం నియమించింది. తాజాగా దీనికి మరింత పటిష్టత తెచ్చేందుకు అడ్వకేట్ జనరల్ సూచన మేరకు ప్రభుత్వం ఈ వ్యవస్థకు చట్ట రూపం కూడా తీసుకొస్తూ తాజా ఆర్డినెన్స్ జారీ చేసింది.ఈ ఆర్డినెన్స్‌తో గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా అందజేసే ప్రభుత్వ సేవలు, గ్రామ/వార్డు సచివాలయ శాఖ ద్వారా జారీ చేసే ఉత్తర్వులు శాసనాధికారంతో కూడినవిగా ఉంటాయని అందులో పేర్కొన్నారు.
అంతే కాకుండా గ్రామ/వార్డు సచివాలయల్లో పని చేస్తున్న ఉద్యోగుల నియామకం, వారి సర్వీస్ అంశాలు కూడా ఆర్డినెన్స్‌లోని నిబంధనలకు అనుగుణంగా చట్టబద్ధత కలిగి ఉంటాయని పేర్కొన్నారు.అయితే వచ్చే శాసనసభ సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్‌కు చట్టసభల ఆమోదం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. గ్రామ/వార్డ్ సచివాలయాలకు చట్టబద్దత చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడంతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.