ఏపీ ప్రజలందరు ఇవాళ అంటే శుక్రవారం రాత్రి 7 గంటలకు చప్పట్లు కొట్టాలి. ఏపీ సీఎం వైఎస్ జగనే రాష్ట్ర ప్రజలంతా చప్పట్లు కొట్టాలని పిలుపునిచ్చారు. అయితే.. చప్పట్లు ఎందుకు కొట్టాలి.. అది కూడా ఈరోజే ఎందుకు? అసలు దీంట్లో ఉన్న తిరకాసు ఏంటో తెలియాలి కదా.
అసలు విషయం ఏంటంటే.. ఈరోజు గాంధీ జయంతి కదా. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున అంటే అక్టోబర్ 2, 2019న సీఎం జగన్.. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను ప్రారంభించారు. ఈరోజుతో సరిగ్గా ఏడాది పూర్తి అయిన సందర్భంగా గ్రామ స్వరాజ్యాన్ని సుసాధ్యం చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు అభినందనలు తెలియజేయడం కోసమే ఏపీ ప్రజలంతా రాత్రి 7 గంటలకు చప్పట్లు కొట్టాలని పిలుపునిచ్చారు.
సీఎం జగన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తన నివాసం నుంచి జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సీఎంవో అధికారులు వెల్లడించారు.
లాక్ డౌన్ సమయంలోనూ కరోనా కట్టడి కోసం అహర్నిశలు కృషి చేసిన పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులను అభినందించడం కోసం ప్రధాని మోదీ.. అందరూ చప్పట్లు కొట్టాలంటూ ప్రోత్సహించిన సంగతి తెలిసిందే. మోదీ పిలుపునకు మంచి స్పందన లభించింది. అందరూ బయటికి వచ్చి కరోనా వారియర్స్ కు కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలిపారు.