ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు.. అదీ అసెంబ్లీ సాక్షిగా. ‘నాకు అమరావతి అయినా విశాఖ అయినా ఒకటే..’ అంటూ వైఎస్ జగన్ స్పష్టం చేయడం గమనార్హం. అయితే, ఆ మాటకు కట్టుబడి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతిలో గడచిన మూడేళ్ళలో ఏం అభివృద్ధి చేశారు.? అన్న ప్రశ్న సహజంగానే తెరపైకొస్తుంది.
చంద్రబాబు హయాంలో ప్రారంభమైన రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ఆ తర్వాత ముందుకు పడలేదు. పైగా, చంద్రబాబు హయాంలో నిర్మాణం ప్రారంభమైన కొన్ని భవనాలు ఆ తర్వాత అతీ గతీ లేకుండా పోయాయి. చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్లు చేసినట్లు లక్ష కోట్ల ఖర్చుతో అమరావతి ప్రాజెక్టు చేపట్టాల్సిన అవసరం లేదు. కానీ, వందల కోట్లు ఖర్చు చేస్తే పూర్తయిపోయే భవనాలు చాలానే వున్నాయ్.
ఏదిఏమైనా, మూడేళ్ళ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘నాకు ఏదైనా ఒకటే’ అంటున్నారు. అదే వైఎస్ జగన్, అమరావతి మీద విషం చిమ్ముతోన్న వైసీపీ నేతల్ని కొంత మేర అదుపులో పెడితే బావుంటుందేమోనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
అమరావతిని దెయ్యాల రాజధానిగా ఓ మంత్రి అభివర్ణిస్తే, అమరావతిని స్మశానంగా ఇంకో మంత్రి అభివర్ణించారు. అమరావతిని ఎడారిగా మరో వైసీపీ ముఖ్య నేత అభివర్ణించారు. అసలు అమరావతిలో రాజధాని వద్దే వద్దంటూ కొడాలి నాని లాంటోళ్ళు మాట్లాడుతున్నారు.
చంద్రబాబు హయాంలో రాజధాని అమరావతి పేరుతో పబ్లిసిటీ స్టంట్లు కావొచ్చు, ఇతరత్రా కారణాల వల్ల కావొచ్చు.. అమరావతి ప్రాజెక్టు ముందుకు కదలకపోతే, ఆ విషయాన్ని సవివరంగా ప్రజల ముందుంచాల్సిన బాధ్యత, తప్పుల్ని సరిదిద్ది శాసన రాజధానిగా అయినా అమరావతిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద వుంది.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అది ఆయన బాధ్యత.
గడచిన మూడేళ్ళలో రాజధాని అమరావతికి వైసీపీ పాలనలో జరిగిందేంటి.? అంటే, ప్రజా వేదిక కూల్చడమొక్కటే.. అన్న అపప్రధ ఎందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మోయాలి.?