దేశంలో కరోనా వైరస్ (కొవిడ్-19) వ్యాప్తి అంతకంతకు పెరిగిపోతుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇప్పుడిప్పుడే వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తోంది. మర్కజ్ వెళ్లొచ్చిన వారితో రాష్ర్టంలో ఒక్కసారిగా కేసులు పెరగడం అటుపై కృష్ణాజిల్లాలో ఊహించని విధంగా కేసులు పెరగడం చూసి తొలుత కాస్త టెన్షన్ వాతావరణం అలుముకున్నా ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేయడంతో కేసులు అదుపులోకి వచ్చాయి. ఎక్కడి కక్కడ జిల్లా స్థాయి సరిహద్దుల వద్ద పహారా పెంచడం…వ్యాప్తి అదుపులోకి తెచ్చే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వ్యవరించిన తీరుపై రాష్ర్ట ప్రజలు హర్షం వ్యక్తం చేసారు.
వైరస్ మహమ్మారి ఏపీకి తాకగానే రాష్ర్ట ప్రభుత్వం వెంటనే అప్రమత్తై ఎక్కడిక్కడ క్వారంటైన్ సెంటర్లు…పరీక్షల నిర్ధారణకు సంబంధించిన కిట్లను హుటా హుటిన ఏర్పాటు చేసి వ్యాప్తిని అడ్డుకోవడంలో సమర్ధవంతంగా పనిచేసింది. కోట్ల రూపాయలు వెచ్చింది క్వారంటైన్లో ఉన్న వారికి..వైరస్ బారిన పడిన వారికి డాక్టర్ల పర్యవేక్షణలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకున్న జాగ్రత్తలపై బాధితులు సైతం హర్షం వ్యక్తం చేసారు. తాజాగా రాష్ర్టంలో వైరస్ పరిస్థితులను సమీక్షించడానికి ఢిల్లీ నుంచి గుంటూరుకు వచ్చిన కేంద్ర బృందం ప్రభుత్వ పనితీరును ప్రశంసించింది. బాధితులకు ఉన్న సంబంధాలు, గుర్తింపు( కాంటాక్ట్, ట్రేసింగ్) విషయంలో గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం అనుసరించిన విధానాన్ని కేంద్ర వైద్య బృందం ప్రశంసించింది.
యంత్రాంగం తీసుకుంటోన్న చర్యలు, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ఈ బృందం శనివారం గుంటూరులో అధ్యయనం చేసింది. బాధితులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాలను పరిశీలించింది. బృందం సభ్యులు డాక్టర్ నందిని భట్టాచార్య, డాక్టర్ బాబీ పాల్ తొలుత జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తీసుకుంటోన్న చర్యల గురించి డాక్టర్ల బృందానికి వివరించారు. జిల్లాలో తొలి కేసు నమోదవ్వగానే పోలీసు, వైద్య యంత్రాంగం బాధితుడ్ని కలిసి ఆయన ఎక్కడెక్కడి వెళ్లారు? ఆయనతో కలిసి ప్రయాణించిన వారి వివరాలను వాగ్ములం రూపంలో తీసుకుందని జిల్లా అధికారులు తెలిపారు. అనుమానితులను సత్వరం గుర్తించి వారికి పరీక్షలు చేయడంతో వ్యాప్తికి అడ్డుకట్ట వేశాం. వారి సెల్ ఫోన్లు, వారు ఎక్కడెక్కడి వెల్లారో రైల్వే, ఆర్టీసీ సమాచారం సేకరించి ధృవీకరించామని ఉన్నత స్థాయి అధికారులకు తెలిపారు.