లాక్ డౌన్ దిశగా హైదరాబాద్.. అదే బెటర్ అంటున్న జనం

మొదట్లో తెలంగాణలో లాక్ డౌన్ నిబంధనలు చాలా కఠినంగానే అమలయ్యాయి.  లాక్ డౌన్ పొడిగింపులో అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణ ఉండేది.  కానీ హైదరాబాద్ నుండి వచ్చే ఆదాయం పడిపోవడంతో కేంద్రంతో పాటు కేసీఆర్ కూడా లాక్ డౌన్ నిబంధనలను ఎత్తివేశారు.  ఫలితంగా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.  రోజూ దగ్గర దగ్గర 1000 కేసులు వరకు నమోదవుతున్నాయి.  వాటిలో 80 నుండి 90 శాతం కేసులు హైదరాబాద్ సిటీలోనే ఉంటున్నాయి.  ఇప్పటివరకు తెలంగాణలో 13,436 కేసులు నమోదవగా టెస్టుల సంఖ్య 80,000 లోపే ఉంది.  జనం మాత్రం యధావిధిగా పనులు చేసుకుంటూనే ఉన్నారు. 
 
సిటీలో ఎక్కడా వైరస్ భయం కనిపించడం లేదు.  భౌతిక దూరం లాంటి కనీస జాగ్రత్తలను చాలా మంది పాటించడంలేదు.  ఇంకొన్ని రోజులు పరిస్థితి ఇలానే ఉంటే వైరస్ సామాజిక వ్యాప్తిగా మారే ప్రమాదం ఉంది.  పైగా టెస్టుల సామర్థ్యం పెరగకపోవడం, ఆసుపత్రుల్లో అరకొర వసతులతో హైదరాబాద్ గందరగోళంగా మారింది.  అందుకే కేసీఆర్ సిటీలో మరోసారి లాక్ డౌన్ విధించే దిశగా ఆలొచిస్తున్నారు.  ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన లాక్ డౌన్ సాధ్యాసాధ్యాలపై పరిశీలన జరిపి లాక్ డౌన్ విధి విధానాలను రూపొందించాలని అధికారులకు సూచించారట. 
 
దీంతో రేపో మాపో హైడరాబాద్లో మళ్లీ లాక్ డౌన్ అనే ప్రకటన వెలువడనుంది.  ఇప్పటికే తమిళనాడులో చెన్నైతో పాటు ఇంకొన్ని నగరాలు, ఏపీలో అనంతపురం, కర్నూల్, విజయవాడ లాంటి ప్రాంతాలు, ఉత్తరాది రాష్ట్రాల్లో హాట్ స్పాట్లుగా ఉన్న నగరాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది.  ఈ కొనసాగింపుతో కేసుల సంఖ్య మెల్లగా అదుపులోకి వస్తోందని ఆయా రాష్ట్రాలు చెబుతున్నాయి.  అందుకే మరోసారి లాక్ డౌన్ ను ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు.  ప్రస్తుత పరిస్థితుల్లో అదే కరెక్ట్ అంటున్నారు.