వైకాపా నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా గన్ మెన్ కరోనా బారిన పడటంతో రోజాకి కరోనా అంటుకుందా? అన్న అనుమానాలు వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె అభిమానులు, వైకాపా కార్యకర్తలు కాస్త ఆందోళనకు గురయ్యారు. అసలే ప్రజా ప్రతినిధులపై కరోనా దాడి చేస్తోంది. చాలా మంది ఎమ్మెల్యేలకు, వాళ్ల చుట్టూ ఉన్న గన్ మెన్లకు, డ్రైవర్లకు ఇతర సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఎవరికి ఎలా? అంటుకుందన్నది తెలియదు గానీ అందరూ వరుసగా కరోనా బారిన పడ్డారు. దీంతో రోజాకి పాజిటివ్ వస్తుందనే భయాందోళనలు వ్యక్తం అయ్యాయి.
దీనికి తోడు నగరి నియోజక వర్గంలో 108 అంబులెన్స్ ప్రారంభోత్సవంలో కొవిడ్ నిబంధనలు ఉల్లఘించారు రోజా. ముక్కుకి మాస్క్ ..చేతికి గ్లౌజ్ లు వేసుకోకుండా…అంబులెన్స్ స్టీరింగ్ కి శానిటైజర్ వేయకుండా స్టీరింగ్ పట్టుకుని డ్రైవ్ చేసారు. దీంతో అభిమానుల్లో మరింత ఆందోళన పెరిగింది. ఓ వర్గం మీడియా అయితే రోజాని టార్గెట్ చేసి మరీ ప్రచారం చేసింది. తాజాగా ఆ విషయాలన్ని రోజాకి దృష్టికి చేరడంతో తనదైన శైలిలో స్పందించిచారు. తన ఆరోగ్యంపై ఎవరు ఆందోళన చెందాల్సినవసరం లేదని…తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. అలాగే పాజిటివ్ వచ్చిన గన్ మెన్ 18 రోజులుగా విధులకు హాజరుకాలేదని, తిరుపతి స్విమ్స్ అసుపత్రిలో కరోనాకి చికిత్స తీసుకుంటున్నాడని, అతని ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు.
రోజా వ్యాఖ్యలతో ఆమె అభిమానులు నెలకొన్న టెన్షన్ తొలగిపోయింది. ప్రస్తుతం ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకి కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మరణాల రేటు కూడా అదే స్థాయిలో ఉంది. దీంతో ప్రభుత్వం మరింత పటిష్ట చర్యలకు సిద్దమవుతోంది. కరోనా అనుమానంతో హోమ్ క్వారంటైన్ లో ఉన్న వాళ్లకి కొవిడ్ చికిత్స కు సంబంధించిన కిట్లను నేరుగా ఇంటికే పంపిణీ చేస్తోంది. ఇంటింటా కరోనా పరీక్షలు నిర్వహించడానికి కూడా ప్రభుత్వం సమాయత్తం అవుతోంది.