Anshu Malika: టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్, నటి, మంత్రి రోజా గురించి మనందరికి తెలిసిందే. ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది రోజా. ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలలో యాక్టీవ్ గా పాల్గొంటూనే, మరోవైపు బుల్లితెరపై ప్రసారం ఎంటర్టైన్మెంట్ షోలకు జెడ్జ్ గా వ్యవహారిస్తోంది. అప్పుడప్పుడు పండుగ ఈవెంట్ లలో కూడా మెరుస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే రోజా కూతురు అన్షు చిన్నప్పటి నుంచి చాలా ట్యాలెంట్ తో అనేక విజయాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే రచయిత్రిగా పుస్తకాలు కూడా రాసింది. పలు సేవా కార్యక్రమాలు చేసింది. ఇలా చిన్న వయసులోనే మంచి మంచి పనులు చేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటూ ఉంటుంది అన్షు. కాగా ప్రస్తుతం ఈమె అమెరికాలో చదువుకుంటున్నారు. అక్కడ చదువుకుంటూనే పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ తన కెరీర్లో దూసుకుపోతుంది. అయితే అన్షుకి తాను చదువుతున్న కాలేజీలో అవార్డు వరించింది. అమెరికా బ్లూమింగ్‌టన్ లోని ఇండియానా వర్సిటీలో రోజా కూతురు అన్షు మాలిక బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్స్ చదువుతుంది. తాజాగా అన్షు ప్రతిష్టాత్మకమైన మౌరీన్ బిగ్గర్స్ అవార్డు 2025, 26 అందుకుంది.
ఇండియానా వర్సిటీ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ ఉమెన్ అండ్ టెక్నాలజీ వ్యవస్థాపకురాలు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మౌరిన్ బిగ్గర్స్ టెక్నాలజీలో ఈక్విటీని ప్రోత్సహిస్తున్న వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. అలా ఈ సంవత్సరం రోజా కూతురు ఈ అవార్డు గెలుచుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెనుకబడిన వర్గాలకు సంబంధించి వారి సాంకేతిక అవకాశాలపై అధ్యయనం చేయడం, నమీబియా, నైజీరియా, భారత్.. లాంటి దేశాల్లో వెనుకబడిన వర్గాల్లో సాంకేతిక విద్యను పెంపొందించే కోడింగ్ శిబిరాలకు నాయకత్వం వహించడం, మహిళలకు వెబ్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వడం, సోషల్ మీడియా ద్వారా పేదవర్గాలకు సాంకేతిక విద్యను అందించడం వంటి అంశాలపై పరిశోధన, వాటి కోసం పనిచేసిన అంశంలో అన్షుకి ఈ అవార్డును ప్రకటించినట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. అయితే తాజాగా అన్షు ఈ అవార్డు తనకు వచ్చినట్టు, అక్కడి లోకల్ మీడియా తన గురించి రాసినట్టు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అన్షుకి అభినందనలు తెలియచేస్తున్నారు అభిమానులు.
