శాసనమండలిలో టీడీజీ జాతీయ కార్యదర్శి లోకేష్ పై వేటుకు రంగం సిద్దం అవుతుందా? ఆ దిశగా టార్గెట్ కూడా ఫిక్స్ అయిందా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో ఈ మ్యాటర్ కాక రేపుతోంది. కౌన్సిల్ కేంద్రంగా వ్యూహ ప్రతివ్యూహాలు సాగుతున్నాయి. మండలిలో లోకేష్ చేసిన రగడ దిశగా ఉచ్చు బిగిస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. మండలిలో పై చేయి సాధించడం కోసం రెండు పార్టీలు అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదిలి పెట్టడం లేదు. ఈ నేపథ్యంలో వైకాపా లోకేష్ పై అనర్హత వేటుకు పావులు కదుపుతుందనే ప్రచారం ఊపందుకుంది. అసెంబ్లీలో వైకాపాది ఏకచక్రధిపత్యం చూపిస్తుంది.
కానీ మండలిలో వైసీపీ కన్నా టీడీపీదే ఆధిక్యం. మూడు రాజధానుల బిల్లు విషయంలో అధికార-ప్రతిపక్షాల మధ్య హోరా హోరీగా పోరు..మాటల యుద్దం సాగిన సంగతి తెలిసిందే. సభా సాక్షిగా ఇరుపక్షాలు మాటలు విసురుకున్నాయి. పరిస్థితి ఒకర్ని ఒకరు తోసుకునే వరకూ కూడా వచ్చింది. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై టీడీపీ సభ్యులు దాడి చేసారని, లోకేష్ సభలో తన మోబైల్ ఫోన్ తో ఫోటోలు తీసాడని, సభ నియమ నిబంధనలకు విరుద్దమని ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేసింది వైసీపీ. అంతకు ముందు సమావేశాల్లోనూ లోకేష్ ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. సీసీ పుటేజీ సహా అన్ని ఆధారాలను కమిటీ ముందుకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఇవే అంశాలను మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు చర్చ సాగుతోంది. అయితే మండలి రద్దుకు వైకాపా చర్యలు సంగతి పక్కనబెడితే! అంతకన్నా ముందు టీడీపీకి కౌన్సిల్ లో కళెం వేయాలని బలంగా సంకల్పించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఢొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీ నుంచి రాజీనామా చేసి మళ్లీ అదే పోస్ట్ లో వైసీపీ నుంచి వచ్చి కూర్చున్నారు. ఇంకా పోతుల సునీత, శివనాథరెడ్డి శమంతకమణి ఇప్పటికే వైసీపీ గూటికి చేరారు. మరో వైపు మండలిలో ప్రతిపక్ష నేత యనమలపై ఎస్సీ ఎస్టీ ఆట్రాసిటీ కేసు నమోదైంది. ఇక మిగిలిన టీడీపీ ఎమ్మెల్సీలను తమ వైపు తిప్పుకోవాలని వైసీపీ వ్యూహ రచన చేసిందా? లోకేష్ పై అనర్హత వేటు వేయాలని కోరడం ద్వారా టీడీపీ కి చెందిన కౌన్సిల్ చైర్మన్ ని కూడా ఇరుకున పెట్టాలన్నది వైసీపీ వ్యూహామా? ఈ స్కెచ్ ఎలా ఉన్నా లోకేష్ పై అనర్హత వేటు సాధ్యమవుతుందా? అదే జరిగితే ఏపీలో రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతాయి ? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.