పిడుగు జగన్ మీద కాదు చంద్రబాబు మీద పడేలా ఉంది 

వైఎస్ జగన్ పాలనలో సంవత్సరం కాలం పూర్తిచేసుకున్న సంధర్భంగా ఏపీ రాజకీయాల్లో సంపూర్ణమైన కదలికలు కనిపిస్తున్నాయి.  ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ వ్యూహాలకు విమర్శలకు పదును పెడుతుంటే వైకాపా పాలన గురించి గొప్పలు చెప్పుకుంటోంది.  అధికార పార్టీ గొప్పలు ఎప్పుడూ ఉండేవే కాబట్టి వాటిపై విమర్శలే ఎక్కువగా అందరినీ ఆకట్టుకుంటాయి.  టీడీపీ చేస్తున్న విమర్శల్లో ఎక్కువగా వినిపిస్తున్నది వైసీపీలో నేతల తిరుగుబాటు. 
 
ఈమధ్య వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ పార్టీ నిర్ణయాలు సరిగా లేవని, ఇసుక మాఫియా నడుస్తోందని, కొన్ని చోట్ల అభివృద్ది శూన్యమని అన్నారు.  ఈ విమర్శల్ని పట్టుకుని వైకాపాలో చీలికలు ఖాయమని టీడీపీ ఊదరగొడుతోంది.  జగన్ లాంటి నేతకు వారి ఎమ్మెల్యేలు కొందరు ఎదురు మాట్లాడటం కొంత సంచలనమే అయినా అంతమాత్రానీకే ఆ పార్టీ ముక్కలు చెక్కలు అవుతుందని చంద్రబాబు అండ్ కో మాట్లాడటం ఆశ్చర్యమే.  నిజానికి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న వైకాపాలో అలా జరగడం అసంభవం.  
 
అయితే వైకాపాలో ముసలం అంటూ మాట్లాడుతున్న చంద్రబాబుగారికి సొంత పార్టీ మీద పడబోయే పిడుగు కనిపిస్తున్నట్టు లేదు.  చీలిక వైకాపాలో కాకుండా టీడీపీలో మొదలైంది.  మద్దాలి గిరి, వల్లభనేని వంశీ, కరణం బలరాం లాంటి బలమైన నేతలు ఇప్పటికే పార్టీని వీడి బయటకు వెళ్లారు.  వీరు అధికారికంగా వైసీపీలో చేరకపోయినా అన్ని విషయాల్లో పూర్తి మద్దతు వైసీపీకి ఇస్తూ చంద్రబాబుకి వ్యతిరేక కూటమిగా ఏర్పడ్డారు.  తమలాగే ఇంకొంత మందిని కూడా పార్టీ నుండి బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నారు. 
 
వీరికి వెనుక నుండి జగన్ అండ్ కో అందించాల్సిన సహకారం మొత్తం అందిస్తోంది.  వచ్చే శాసనసభ సమావేశాల నాటికి టీడీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనే యోచనలో జగన్ ఉన్నారు.  ఆ మేరకు ఆపరేషన్ ఆకర్ష్ చాప కింద నీరులా నడుస్తోంది.  కొద్దిరోజుల క్రితమే ఇద్దరు ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారే వాతావరణం కనబడినా వెనక్కి తగ్గారు.  వారిని ఆపడానికి అధినేత చంద్రబాబు నాయుడు చాలానే ప్రయాస పడాల్సి వచ్చిందని టాక్.  
 
ఇకమీదట కూడా బాబుగారు ఇలాంటి ప్రయాసలు ఎన్నో పడాల్సి ఉంది.  ఒకవేళ ఆ ప్రయాసలు ఫలించకపోతే ప్రతిపక్ష హోదా కోల్పోయి పార్టీ స్థితి మరింత అద్వానంగా మారే ప్రమాదం ఉంది.  గతంలో 23 మంది వైకాపా ఎమ్మెల్యేలను తనవైపుకు లాక్కుని పిరాయింపుదారులకు పదవులు కూడా కట్టబెట్టిన బాబుగారికి ఇప్పుడు తమ ఎమ్మెల్యేలు బయటికి వెళ్లిపోతే కనీసం ప్రశ్నించే నైతిక హక్కు కూడా లేదు.  కాబట్టి వైసీపీలో చీలికలు తేవడం సంగతి దేవుడెరుగు ముందు తన ఎమ్మెల్యేలు బయటికి పోకుండా చూసుకోవాలి ఆయన.