అర్థరాత్రి ఆర్డినెన్స్.. ఇది ధనిక సీఎం కేసీఆర్ వైనం

 కరోనా లాక్ డౌన్ కారణంగా అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయి.  ఆదాయ మార్గాలు మూసుకుపోవడంతో పాలనా వ్యయానికి నిధులు లేని కష్ట కాలం నెలకొంది.  ఈ పరిస్థితి నుండి కొంత ఉపశమనం కోసం అన్ని రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టాయి.  వాటిలో ఏపీ, తెలంగాణ కూడా ఉన్నాయి.  మొదటి రెండు నెలలు ఇబ్బందులు పడిన ఉద్యోగులు, పెన్షన్ దారులు ఇక వల్ల కాదని చేతులెత్తేశారు.  దీంతో ఏపీ సర్కార్ జూన్ నెలలో పూర్తి జీతాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.  దీంతో తెలంగాణ ఉద్యోగులు సైతం మూడో నెల నుండి తమకు కూడా పూర్తి జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 
 
అయితే దీనిపై ఇన్నిరోజులు నిర్ణయం తీసుకోని కేసీఆర్ ఉన్నపళంగా నిన్న అర్థరాత్రి ఆర్డినెన్స్ జారీ చేశారు.  తెలంగాణ విపత్తులు, ప్రజారోగ్య అత్యయిక ఆర్డినెన్స్‌ 2020కి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్ జారీ చేసింది.  మార్చి 24 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్టు సర్కార్ స్పష్టం చేసింది.  విపత్తులు, అత్యయిక పరిస్థితుల్లో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఎయిడెడ్‌ సంస్థల ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల పింఛన్లలో 50శాతం వరకు కోత విధించేలా ఆర్డినెన్స్‌ రూపొందించింది.  కోత విధించిన మొత్తాన్ని ఆర్నెల్లలో ఉద్యోగులు, పెన్షనర్లకు తిరిగి చెల్లించాలని కూడా పేర్కొంది.
 
దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు జూన్ నెల జీతాల్లో, పెన్షన్లలో కూడా కోత పెట్టడానికే ఈ అర్థరాత్రి  ఆర్డినెన్స్ అని వాపోతున్నారు.  మాటకు ముందొకసారి, తర్వాత ఒకసారి తెలంగాణ రాష్ట్రం విస్తీర్ణంలో చిన్నదే అయినా అనేక రాష్ట్రాలతో పోలిస్తే ఆదాయంలో దనిక రాష్ట్రమని చెబుతుంటారు కేసీఆర్.  అలాంటి రాష్ట్రం ఇలా ఉద్యోగుల జీతాల్లో, చివరికి పెన్షనర్ల పెన్షన్లలో కోత పెట్టి ప్రభుత్వాన్ని నడుపుకోవాల్సిన దుస్థితి.  సరే ఆర్థిక ఇబ్బందే అనుకున్నా ఒకటి లేదా రెండు నెలలు ఉండొచ్చు కానీ ఇలా నెలల తరబడి ఉంటాయా.. అదీ ధనిక రాష్ట్రంలో అంటున్నారు జనం.