డాక్టర్ రాజశేఖర్ పునరాగమన ద్వితీయ నజరానా ‘కల్కి’ మరింకో కేసు దర్యాప్తు పోలీసాఫీసర్ని ప్రసాదిస్తోంది. ఈ సంవత్సరం ఈ ఆరు నెలల్లోనే వరసగా అరడజను సస్పెన్స్ / క్రైం థ్రిల్లర్స్ ప్రేక్షకుల్ని పలకరించాక ఇప్పుడు మరొకటి చేరింది. రెగ్యులర్ సినిమాల మధ్య నెలకొకటి చొప్పున ఈ జానర్ సినిమాల్ని అసంకల్పితంగా ప్రేక్షకుల మధ్యకి వదుల్తున్నారు. ‘అ!’ అనే తన తొలి మూవీతో ప్రేక్షకులకి అర్ధంగాని కళా ఖండ ప్రదర్శన చేసిన దర్శకుడు ప్రశాంత వర్మ, త్వరలోనే కోలుకుని రెండో ప్రయత్నం చేయడం ఒక శుభపరిణామం. మరి ఈ ప్రయత్నం ఏమైనా ఫలించిందా? తను ముందే చెప్పాడు – ఈసారి అర్ధమయ్యేటట్టు సినిమా తీశానని. చూద్దాం ఎలా తీశాడో…
కథ
1980 ల నాటి కథ. అప్పట్లో తెలంగాణలో కొల్లాపూర్ అనే చోట నరసప్ప (ఆశుతోష్ రాణా) అనే ఎమ్మెల్యే వుంటాడు. అతడి ప్రత్యర్ధి పెరుమాళ్ళు(శత్రు). ఒక రాత్రి నరసప్ప తమ్ముడు శేఖర్ బాబు (సిద్ధూ జొన్నలగడ్డ) దారుణ హత్యకి గురవుతాడు. దీంతో నరసప్ప, పెరుమాళ్ళు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతాయి. ఈ హత్య కేసు దర్యాప్తు చేయడానికి ఐపీఎస్ ఆఫీసర్ కల్కి (రాజశేఖర్) వస్తాడు. అంతకి ముందే వూళ్ళో వున్న పిరికి జర్నలిస్టు దేవదత్తా (రాహుల్ రామకృష్ణ) కల్కికి జత కలుస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి దర్యాప్తులో ఏం తేలింది? శేఖర్ బాబుని ఎవరు ఎందుకు చంపారు? శ్రీశైలంలో మూడు పడవల మునకకీ ఈ కేసుకీ సంబంధమేమిటి? అటవీ ప్రాంతంలోఇళ్ళు కాలిపోవడానికి కారణమేమిటి? అసలు కొల్లాపూర్ సంస్థానం రాజమాత రామచంద్రమ్మ కథేమిటి? ఇవన్నీ కలుపుకుని సర్ప్రైజ్ ఎండింగ్ ఏమిటి?… ఇవి తెలుసుకోవాలంటే వెండితెరని ఆశ్రయించాల్సిందే.
ఎలా వుంది కథ
పీరియడ్ జానర్ లో పోలీసు దర్యాప్తు కథ. లీనియర్ కథ. ఈ మధ్య కొన్ని పోలీస్ దర్యాప్తు జానర్లు నాన్ లీనియర్ గా చేసి, మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులతో కన్ఫ్యూజ్ చేసినట్టు గాక, తేలికగా అర్ధమవుతూ వుండే లీనియర్ కథ. అలాగే ఇది బోలెడు క్లూస్ తో, ఆ క్లూస్ కి వివరణలతో, విశ్లేషణలతో కాలం చెల్లిన ఇన్వెస్టిగేషన్ ఓరియెంటెడ్ కాకుండా, యాక్షన్ ఆధారిత దర్యాప్తు కథ. ఒక సాక్షినుంచి ఇంకో సాక్షికి చేరవేస్తూ వుండే దర్యాప్తు క్రమంలో, కేసు వీడి పోతూ వుండే విధం యాక్షన్ ఆధారంగా వుంటుంది. ఇందులో లోపాలు, లొసుగులు లేవని కాదు. ఇవి కామన్ ఐపోయాయి. ఈ కథ మేజర్ ప్లస్ పాయింటు సర్ప్రైజ్ ఎండింగ్.
రాజశేఖర్ స్లిమ్ గా తయారయ్యాడు. పోలీసు పాత్రలు అతడికి కొత్త కాదు. ఈసారి నీటుగా మందు కొడుతూ డ్యూటీ చేయడమే కొత్త. ఫస్టాఫ్ లో ఒకటి, సెకండాఫ్ లో మరొకటి విభిన్నమైన యాక్షన్ సీన్స్ తన ఇమేజికి తగ్గట్టుగా చేశాడు. రోమాన్స్ కి స్కోపు లేదు. ఉన్న లవ్ ట్రాక్ కూడా కృత్రిమంగా వుంది. ఈ లవ్ ఫ్లాష్ బ్యాకుల్లో వుండడం కొంత వెరైటీగా వున్నా విషయం లేక తేలిపోయింది. హీరోయిన్ అదా శర్మతో చేయడానికి రోమాన్సేమీ లేదు. దర్యాప్తు సీన్లు ఫన్నీగా రావడానికి పక్క పాత్ర రాహుల్ రామకృష్ణ బాగా తోడ్పడ్డాడు.
ఎవరెలా చేశారు
అదా శర్మ డాక్టర్ పద్మగా నటిస్తే, నందితా శ్వేత టూరిజంపై ఆసక్తి వున్న ఆసిమా ఖాన్ గా నటించింది. ఆమె తండ్రి కబీర్ ఖాన్ గా జయప్రకాష్ ది పేరుకి లాయర్ పాత్ర. ఇక నరసప్పగా ఆశుతోష్ రాణా, పెరుమాళ్ళుగా శత్రు రొటీన్ విలన్సే. కాకపోతే శత్రు పాత్రకి షేడ్స్, సస్పెన్స్ వున్నాయి. అలాగే మొత్తం కథకి కేంద్ర బిందువైన శేఖర్ బాబు పాత్రలో సిద్ధూ జొన్నలగడ్డది ఇంకో సస్పెన్స్ వున్న పాత్ర. ఇవి చివరి అరగంట కథని నిలబెడతాయి.
ఇక ఈ మూవీ ఆద్యంతం నవ్వించే పిరికి జర్నలిస్టు పాత్రలో రాహుల్ రామకృష్ణ వల్ల ఈ మూవీ వినోదాత్మక విలువ బాగా పెరిగింది. పిరికి డైలాగులు, అమాయక డైలాగులు బాగా పేల్చుకున్నాడు. ‘సార్ ఏంట్సార్ ఇదీ, పురావస్తు శాఖలాగా తవ్విన కొద్దీ ఒక్కోడు దొరుకుతుండు?’ అన్న డైలాగు బాగా పేలింది.
సంగీతం విషయానికొస్తే రెండు సాంగ్స్ వున్నాయి. ఒకటి కులూ మనాలిలో రాజశేఖర్ డ్యూయెట్, తర్వాత ఇంకో చోట ఐటెం సాంగ్. రెండూ పూర్ గా వున్నాయి గానీ, బిజిఎం పవర్ఫుల్ గా వుంది. శ్రవణ్ భరద్వాజ్ పలికించిన ఇన్ స్ట్రుమెంట్స్ కథా వాతావరణానికి తగ్గట్టు ఎఫెక్టివ్ గా వున్నాయి. ఇక విజువల్స్ విషయంలో తనదైన ప్రత్యేక ముద్ర కలిగి వున్నాడని ‘అ!’ లోనే దర్శకుడు ప్రశాంత్ వర్మ చూపించుకున్నాడు. ఇప్పుడు ఈ ఔట్ డోర్ థ్రిల్లర్ తో బాగా విజృంభించాడు. కెమెరా మాన్ దాశరథి శివేంద్రతో కలిసి సృష్టించిన వెలుగు నీడల దృశ్యఫలితాలు మామూలుగా లేవు. డీఐ వచ్చాక దృశ్యాల్లో డెప్త్ మాయమైందనే వాళ్ళు కెమెరా మాన్లు. ఈ పీరియడ్ వాతావరణానికి చాలా డెప్త్ తో షాట్స్ వున్నాయి. కొన్ని షాట్స్ మతిపోగొట్టేలా వున్నాయి. ఈ పీరియడ్ కి కళాదర్శకత్వం వహించిన నాగేంద్ర, పోరాటాలు సమకూర్చిన నాగ వెంకట్, రాబిన్ సుబ్బులు, ఎడిటింగ్ నిర్వహించిన ఎన్ గౌతమ్ అందరూ మంచి కళా ప్రదర్శన చేశారు.
చివరికేమిటి
1947 లో కొల్లాపూర్ సంస్థానం విలీనమై, దాంతో ఎన్నికల్లో నిలబడ్డ నరసప్ప తనకి పోటీగా నిలబడ్డ సంస్థాన రాజమాతని అంతమొందించడమనే పూర్వ కథతో ప్రారంభమయ్యే ఈ లీనియర్ కథ, 1980 లో నరసప్ప తమ్ముడు శేఖర్ బాబు హత్యతో, కల్కి ప్రవేశంతో దర్యాప్తు కథగా మారుతుంది. ఈ లీనియర్ దర్యాప్తు కథకి వివిధ సాక్షులతో ఉప కథలు పుట్టుకొస్తాయి. ఇవి ఫ్లాష్ బ్యాక్స్ తో వస్తాయి. ఈ ఉపకథలు కొన్ని అవసరం లేకున్నా వున్నాయి. వీటి వల్లనిడివి 2 గంటల 42 నిమిషాలు సాగింది. ఈ సంవత్సరం పెద్దా చిన్నా, కొన్ని పనికిరాని సున్నా సినిమాలు కూడా నిడివి 2 గంటల 40 నిమిషాలుగా వుండడం ఒక అలవాటుగా మారినట్టుంది.
ఈ కథ ఇంటర్వెల్ కే పెరుమాళ్ళు కాదనీ, నరసప్పే తమ్ముడ్ని చంపాడని మలుపు వస్తుంది. చివరివరకూ నేరస్థుడ్ని గుర్తించకుండా ఎండ్ సస్పెన్స్ లో పెట్టడం కన్నాఇది మంచిదే. ఇక నరసప్పని అరెస్టు చేసే ఎవిడెన్స్ కోసమే మిగతా కథ. ఐతే ఇది వెళ్లివెళ్ళీ సర్ప్రైజ్ ఎండింగ్ కి దారితీయడమన్నది ఒక మాస్టర్ స్ట్రోక్ అనొచ్చు. అయితే కథనంలో అనేక లోపాలు, అధిక నిడివి ఈ థ్రిల్లర్ క్వాలిటీని తగ్గించేస్తున్నాయి.
రచన – దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
తారాగణం : రాజశేఖర్, అదా శర్మ, నందితా శ్వేత, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, సిద్ధూ జొన్నలగడ్డ, నాజర్, అశుతోష్ రాణా, శత్రు, తదితరులు
కథ: సాయితేజ. సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర
బ్యానర్ : హ్యాపీ మూవీస్
నిర్మాత: సి.కళ్యాణ్
విడుదల : జూన్, 28, 2019
2.5
―సికిందర్
.