పురుషాధిక్యాన్ని, పితృస్వామ్య భావనలను ప్రతిబింబించే సినిమాలను తాను వ్యతిరేకిస్తానని, అలాంటి కథలు సమాజాన్ని కొన్ని ఏళ్లు వెనక్కి తీసుకెళ్తాయని వ్యాఖ్యానించారు బాలీవుడ్ అగ్ర నటుడు, మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్‌ఖాన్. ఇటీవల ఓ అంతర్జాతీయ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పైవిధంగా స్పం దించారు.
‘గతకొంతకాలంగా మేల్ డామినేట్ స్టోరీస్ ఎక్కువగా వస్తున్నాయి. దశాబ్దాల కిందటే సమసిపోయిన పితృస్వామ్య భావాలను ప్రోత్సహించే కథాంశాలను తెరకెక్కిస్తున్నారు. అలాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సాధిస్తున్నాయి. ఈ ధోరణి మంచిది కాదు. ఇప్పుడు సమాజం అన్ని రంగాల్లో ఆధునిక ఆలోచనలతో పురోగమిస్తున్నది. అయినా ఇప్పటికీ పరిష్కారించాల్సిన సామాజిక సమస్యలున్నాయి. వాటిపై దృష్టి పెడితే సమాజ అభ్యున్నతికి సృజనాత్మక మార్గంలో సహాయం చేసినవాళ్లమవుతాం. స్త్రీకి కొంతమేరకే స్వేచ్ఛనివ్వాలనే ఆలోచనలు పురుషుల్లోని అభద్రతాభావాన్ని సూచిస్తాయి. నేటి స్త్రీలు స్వీయ నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు. వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత పురుషలపై ఉంది’ అని అమీర్ వ్యాఖ్యానించారు.
స్త్రీ సాధికారత ప్రధానాంశంగా ఆయన నిర్మించిన ‘లాపతా లేడీస్’ చిత్రం ప్రశంసలతో పాటు ఈ ఏడాది భారత్ నుంచి ఆస్కార్ బరిలో పోటీపడుతున్న అధికారిక చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం అమీర్‌ఖాన్ ‘తారే జమీన్ పర్’ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.