సొంతంగా యూట్యూబ్‌ ప్రారంభించిన నాగచైతన్య!

ఈ ఏడాది కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన టాలీవుడ్‌ యాక్టర్‌ నాగచైతన్య ప్రస్తుతం చందూమొండేటి దర్శకత్వంలో 23 సినిమాతో బిజీగా ఉన్నాడు. చైతూ ఓ వైపు ప్రొఫెషనల్‌గా బిజీగా ఉంటూనే.. మరోవైపు సొంతంగా యూట్యూబ్‌ ఛానల్‌ ను ప్రారంభించాడు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు తమకు సంబంధించిన విశేషాలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఎక్స్‌, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌తోపాటు యూట్యూబ్‌ ద్వారాను ప్రేక్షకులకు చేరువలో ఉంటున్నారు. వారికి సంబంధించిన చిత్ర ప్రమోషన్స్‌ను కూడా ఈ వేదికల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

తాజాగా ఈ జాబితాలోకి చైతూ వచ్చి చేరాడు. ‘అక్కినేని నాగచైతన్య’ పేరుతో ఛానల్‌ను రూపొందించి ఆయన.. అందులో శుక్రవారం ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. యూట్యూబ్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టానంటూ వెల్లడించాడు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర జవాబులు ఇచ్చాడు. ఇందులో భాగంగా ఓ నెటిజన్‌ ‘జుట్టు, గడ్డం పెంచడానికి కారణం తెలుసుకోవచ్చా..?’ అని ప్రశ్నించాడు. దీనికి చైతూ బదులిస్తూ.. ఆరు నెలలుగా జాబ్‌ లేదని, ఇంట్లో ఖాళీగా ఉంటున్నట్లు చెప్పాడు.

పనేంలేక జుట్టు, గడ్డం పెంచినట్లు సరదాగా సమాధానమిచ్చాడు. ఆ తర్వాత తాను హీరోగా నటిస్తున్న చందూ మొండేటి తెరకెక్కించనున్న చిత్రం కోసం పెంచినట్లు క్లారిటీ ఇచ్చాడు. ఫిషర్‌మెన్‌ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న 23సినిమాని పాపులర్‌ బ్యానర్‌ గీతాఆర్ట్స్‌పై తెరకెక్కిస్తోంది. విక్రమ్‌ కే కుమార్‌ దర్శకత్వంలో చైతూ నటించిన వెబ్‌ ప్రాజెక్టు ధూత. ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ధూత తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అమెజాన్‌ ప్రైమ్‌లో డిసెంబర్‌ 1 స్ట్రీమింగ్‌ కానుందని ఇప్పటికే అప్‌డేట్‌ వచ్చింది.