సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా SSMB29పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కు 1000 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నట్టు ఫిలిం సర్కిల్స్‌లో టాక్. ఈ చిత్రానికి కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించడం, మేకింగ్ పరంగా హాలీవుడ్ స్థాయిలో రూపొందుతోందన్న ప్రచారం ఇప్పటికే అంచనాలను ఊహించలేని స్థాయికి తీసుకెళ్లింది.
ఇప్పటికే ఒడిశా, హైదరాబాద్, విదేశాల్లో కీలక షూట్‌లు జరిగాయని సమాచారం. మహేష్ బాబు కోసం ప్రత్యేకమైన యాక్షన్ సీన్స్ తెరకెక్కించారని, ఈ సినిమాతో ఆయన తన కెరీర్‌లో తొలిసారి షర్ట్ లేకుండా కనిపిస్తాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తాజా షెడ్యూల్‌కి ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రచారం సాగుతోంది. అయితే ఇంత హైప్ ఉన్న సినిమాకే ఇప్పటి వరకు అధికారికంగా ఒక్క అప్డేట్ కూడా రాలేదంటే ఆశ్చర్యమే కాదు.. అసహనమూ వ్యక్తమవుతోంది.
ప్రియాంక చోప్రా ఈ సినిమాలో భాగమని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పడం తప్ప, ఏ ఒక్క ఫస్ట్ లుక్, పోస్టర్, టీజర్.. ఏదీ బయటకు రాలేదు. ఈ నిశ్శబ్దం వెనుక కారణం ఏమిటి? అనేది ఇప్పుడు ఫ్యాన్స్ నుంచి విశ్లేషకుల దాకా చర్చగా మారింది. రాజమౌళి గత సినిమాల్లా ఓ ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్ గా ప్రారంభాన్ని ప్రకటిస్తారని అందరూ భావించారు. కానీ ఈసారి మాత్రం ఆయన నిశ్శబ్దంగా ఉండటం స్ట్రాటజీ అంటున్నారు ఇండస్ట్రీలోని పలువురు.
రాజమౌళి సినిమాల పబ్లిసిటీ పక్కా ప్లాన్ ప్రకారమే నడుస్తుంది. ఏ దశలో ఏ అప్డేట్ వదలాలో ఆయనకు స్పష్టంగా ఉంటుంది. ఒకసారి షూటింగ్ చాలా దూరం వెళ్లిన తర్వాతే, ఒక్కటొక్కటిగా విజువల్స్, కాన్సెప్ట్ అప్డేట్స్ వదలడం ద్వారా ఆత్రుతను రెట్టింపు చేస్తారు. SSMB29 విషయంలో కూడా ఇదే విధానాన్ని ఆయన ఫాలో అవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఆయన స్టైలే వేరని మళ్లీ నిరూపిస్తున్నాడు.