సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అమీర్ ఖాన్ హిట్ సినిమా ‘దంగల్’లో చిన్నారి బబితా ఫోగట్ పాత్ర పోషించిన బాల నటి సుహానీ భట్నాగర్ తాజాగా కన్ను మూశారు. ఈ వార్త సినీ పరిశ్రమలోని అందరినీ కలచివేసింది. సుహాని కేవలం 19 ఏళ్లకే ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికింది. సుహాని గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని, ఆ అనారోగ్యం కారణంగా సుహాని శనివారం మరణించారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
‘దంగల్’ సినిమాలో బబితా ఫోగట్ పాత్రతో సుహానీ భట్నాగర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ పరిస్థితుల్లో సుహాని మృతి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 19 ఏళ్లకే సుహాని కన్నుమూసిందంటే అభిమానులు నమ్మలేకపోతున్నారు. ఇక అందుతున్న సమాచారం మేరకు సుహాని మరణానికి కారణం ఆమె శరీరం మొత్తం నీరు పట్టడం అని అంటున్నారు. కొంత కాలం క్రితం సుహానీకి యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే.
ఈ సమయంలో ఆమె కాలు ఫ్రాక్చర్ అయింది. అదే సమయంలో, చికిత్స కోసం తీసుకున్న మందులకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని తెలుస్తోంది. వాటి కారణంగా ఆమె శరీరంలో నీరు పేరుకుపోవడం మొదలైంది. ఇక ఆ కారణంగా ఆమె చాలా కాలం నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అలా చికిత్స పొందుతూ ఆమె ఈరోజు మరణించింది.
ఇక ఈ రోజు సుహాని అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. సుహాని చిన్న వయసులోనే పెద్ద పేరు సంపాదించింది. అమీర్ ఖాన్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘దంగల్’ (2016)లో బబితా ఫోగట్ పాత్రను పోషించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు అందాయి. ఇదే కాక ఆమె అనేక టెలివిజన్ వాణిజ్య ప్రకటనలలో కూడా కనిపించింది.
అయితే ‘దంగల్’ తర్వాత చాలా సినిమాల నుంచి ఆఫర్లు వచ్చినా నటనకు విరామం ఇవ్వాలని సుహాని నిర్ణయించుకుంది. ఆమె చదువుపై దృష్టి పెట్టాలనుకుంది. చాలా ఇంటర్వ్యూలలో, సుహాని తన చదువు పూర్తి చేసిన తర్వాత, తాను తిరిగి సినిమా పరిశ్రమకు రావాలని అనుకున్నట్లు చెప్పింది. కానీ అది తీరని కోరికగానే మిగిలిపోయింది.