‘దంగల్‌’ అమ్మాయి మృతిపై తల్లిదండ్రుల కన్నీరు.. మున్నీరు!

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమీర్‌ ఖాన్‌ ‘దంగల్‌’ చిత్రంలో నటించి చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు సుహానీ భట్నాగర్‌ . బబితా కుమారిగా ప్రేక్షకులకు చేరువైన ఆమె అరుదైన వ్యాధితో ఇటీవల మృతి చెందారు. దీనిపై తాజాగా ఆమె తల్లి పూజ మీడియాతో మాట్లాడారు. ‘మేము సుహానీ వ్యాధి గురించి ఎవరికీ చెప్పలేదు.

ఆమెకు ఎంతో సపోర్ట్‌గా ఉండే అమీర్‌ ఖాన్‌ కు కూడా దీని గురించి చెప్పలేదు. ఇది కేవలం చర్మ సమస్య అనుకున్నాం. సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించాం. చికిత్స కోసం ఎయిమ్స్‌లో చేర్పించాక.. డెర్మటోమయోసైటిస్‌ వ్యాధిగా వైద్యులు గుర్తించారు. ఇన్‌ఫెక్షన్‌ బారిన పడి శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో ఆమె ప్రాణాలు విడిచింది.

సుహానీ చాలా తెలివైన అమ్మాయి. చేసే ప్రతి పనిలో రాణించాలనుకునేది. తను ‘దంగల్‌’ చిత్రం చేయడం వల్ల తల్లిదండ్రులుగా మాకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. అందరి తల్లిదండ్రుల్లానే మేము మా అమ్మాయిని చూసి చాలా గర్వపడేవాళ్లం‘ అని ఆమె కన్నీరుమున్నీరైంది.

‘సుహానీ ఇకలేదన్న వార్త మా మనసుల్ని తీవ్రంగా కలచివేస్తోంది. ఆమె కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఆమె లేకుండా ‘దంగల్‌’ అసంపూర్ణం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి‘ అంటూ ఆమీర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.