Immunity: కరోనా పరిస్థితుల్లో ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. యోగా, వ్యాయామం చేయడంతోపాటు పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటున్నారు. మొత్తంగా ప్రజల ఆలోచనల్లో మార్పులు స్పష్టంగా వచ్చాయి. కేవలం కరోనా గురించే కాకుండా మంచి ఆరోగ్యం కోసం వీటిని పాటించాలంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం.. అదే రోగనిరోధక శక్తిని బలహీనం చేసే ఆహార పదార్ధాలను దూరం పెట్డడం కూడా చేయాల్సిందే. నిపుణుల అభిప్రాయం ప్రకారం..
తీసుకునే ఆహారంలో వేపుళ్లు వద్దని ఎప్పటినుంచో అందరూ చెప్తున్నారు. ఎక్కువగా వేయించడం వల్ల వాటిలో ఉండే చక్కెర, ప్రోటీన్లు, కొవ్వు పదార్ధాలతో రసాయన చర్య జరుపడమే అనారోగ్యానికి కారణం. నూనెలో బాగా వేయించిన పదార్థాలతో శరీర కణజాలం దెబ్బతినే అవకాశముంది. ఇది రోగనిరోధక శక్తిని తగ్గేలా చేయడంతో శరీర భాగాల పనితీరు మందగిస్తుంది. ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో చిప్స్, బాగావేయించిన చేపలు.. ఇలా బాగా వేయించిన ఆహారాన్ని పరిమితంగా తీసుకోవాలని చెప్తున్నారు.
ఉప్పు మన రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. ఉప్పు శాతం ఎప్పుడూ సమతుల్యంగా ఉండాలి. ఉప్పు శాతం పెరిగితే.. శరీర భాగాల్లో వాపు ఏర్పడే అవకాశాలెక్కువ. రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు వ్యాధులేమైనా వస్తే ఆ ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే శుద్ది చేసిన ఆహారం, బేకరీ ఉత్పత్తులు, ప్యాకేజ్డ్ చిప్స్ తగ్గించాలి. వీటిలో ఎక్కువ మోతాదులో ఉండే ఉప్పు పేగుల్లోని మంచి బ్యాక్టీరియాపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రోజువారీ ఆహారంలో ఉప్పును తగ్గించడం ఉత్తమం.
స్వీట్లు, ఇతర తీపి పదార్ధాలకు దూరంగా ఉండాలి. వీటివల్ల వివిధ రకాల అనారోగ్యాలు దరి చేరే అవకాశం ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. రక్తంలో ఎక్కువగా ఉండే చక్కెర గట్ బ్యాక్టీరియాపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. కాఫీ, టీలలో కెఫిన్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియలకు మేలు చేస్తాయి. కానీ.. ఎక్కువైతే నిద్ర సమస్యలు, కడుపులో మంట, ఎసిడిటీ సమస్యలు వస్తాయి. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. డ్రింకింగ్ హ్యాబిట్ కూడా మితంగా ఉండటం ఉత్తమం. ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకునేవారిలో పలు శారీరక, మానసిక అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి.
గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.