రంగురంగుల కేకులు, మెరిసే స్వీట్స్.. ఇవి చూసిన వెంటనే పిల్లలే కాదు పెద్దలూ కంట్రోల్ కోల్పోతారు. పుట్టినరోజులు, వేడుకలు, చిన్న ఆనందాలన్నిటికీ కేక్ తప్పనిసరి అన్నట్టుగా మారిపోయింది. కానీ ఈ తియ్యటి రుచిలో దాగున్న చేదు నిజం ఇప్పుడు ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. కేవలం రుచికోసం తయారయ్యే కొన్ని కేకులు, స్వీట్స్ నెమ్మదిగా శరీరాన్ని నాశనం చేసే కెమికల్స్‌తో నిండిపోయి ఉంటున్నాయని హెచ్చరిస్తున్నారు.
ఆకర్షణీయమైన రంగులు, మెత్తని టెక్స్చర్, ఎక్కువ రోజులు చెడకుండా ఉండాలనే లక్ష్యంతో కొందరు తయారీదారులు ఆర్టిఫిషియల్ కలర్స్, ప్రిజర్వేటివ్స్, లిక్విడ్ గ్లూకోజ్, నాణ్యత లేని కొవ్వులు విరివిగా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలురా రెడ్, టార్ట్రాజైన్, సన్‌సెట్ ఎల్లో వంటి రసాయన రంగులు పిల్లల్లో అలర్జీలు, హైపర్ యాక్టివిటీ, చర్మ సమస్యలకు కారణమవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇక కేకుల్లో వాడే రిఫైన్డ్ షుగర్, మైదా, వనస్పతి శరీరంలో షుగర్ లెవెల్స్‌ను ఒక్కసారిగా పెంచేస్తాయి. దీని వల్ల చిన్న వయసులోనే టైప్-2 డయాబెటిస్, ఊబకాయం ప్రమాదం పెరుగుతోంది. కొన్ని కేకుల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయేలా చేసి హార్ట్ ఎటాక్ ముప్పును కూడా పెంచుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కేకులు మెత్తగా ఉండేందుకు వాడే పాలీసోర్బేట్-60 పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను నాశనం చేసి జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. అలాగే నిల్వకాలం పెంచేందుకు వినియోగించే పొటాషియం సోర్బేట్, సోడియం బెంజోయేట్ లాంటి రసాయనాలు దీర్ఘకాలంలో డీఎన్‌ఏపై ప్రభావం చూపే అవకాశముందని చెబుతున్నారు. బేకింగ్ పౌడర్‌లోని అల్యూమినియం ఫాస్ఫేట్ మతిమరపు సమస్యలతో కూడా సంబంధం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
తక్కువ ధరకు దొరికే కేకులు, స్వీట్స్ పట్ల ప్రత్యేకంగా జాగ్రత్త అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. ప్యాకెట్‌పై లేబుల్‌లో కెమికల్స్ జాబితా ఎక్కువగా ఉంటే అలాంటి ఉత్పత్తులను దూరంగా పెట్టడం మంచిదని చెబుతున్నారు. రోజువారీగా కేకులు, స్వీట్స్ తినే అలవాటును తగ్గించి, నెలకు ఒకటి లేదా రెండు సార్లకే పరిమితం చేయాలని సూచిస్తున్నారు. పిల్లలకు స్వీట్స్ బదులు పండ్లు, డ్రైఫ్రూట్స్, ఇంట్లో తయారుచేసిన ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇవ్వడం ద్వారా ఈ ప్రమాదాలను తగ్గించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. తియ్యటి రుచి కంటే ఆరోగ్యం ముఖ్యమని గుర్తిస్తేనే రేపటి తరం భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందన్నది నిపుణుల మాట.
