క్యాబేజీ, కాలిఫ్లవర్ లేకుండా ఇపుడువంటలుండవు. ఇంట్లోనే కాదు, బయట కూడా గోబీ మంచూరియా, గోబీ 65 పేర్లతో కాలిఫ్లవర్ వాడకం విపరీతంగా పెరిగింది. క్యాబేజీ కూడా ఇంతే, క్యాబేజీతో వేపుళ్లు, సూప్ లు పకోడీలు… ఇలా ఎన్నెన్నో వస్తున్నాయి. అయితే, క్యాబేజీ, కాలిఫ్లవర్ తినే ముందు తెలుసుకోవలసిన విషయం ఒకటుంది. ముఖ్యంగా హైదరాబాద్ వాసులు.
హైదరాబాద్ లో క్యాబేజీ కాలిఫ్లవర్ బాగా తింటున్నారంటే… వాటితోపాటు అనేక రకాల పెస్టిసైడ్స్ కూడా లాగించేస్తున్నట్లే లెక్క. పంటలమీద చల్లే పురుగుల మందులు కూరగాయలతో పాటు మన శరీరంలోకి ప్రవేశించి హాని చేస్తాయి. హైదరాబాద్ కాలిఫ్లవర్, క్యాబేజీలలో ఉన్న పెస్టిసైడ్స్ గురించి నెలనెలా విశ్లేషణ చేసే నేషనల్ ఇన్ స్టిట్యటూ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్ మెంట్ (NIPHM) చాలా ఆసక్తి కరమయిన విషయాలు వెల్లడించింది.
అక్టోబర్ లో ఈ సంస్థ శంషాబాద్, బుద్వేల్ మార్కెట్ ల నుంచి 20 రకాల క్యాబేజీ శాంపిల్స్ ను సేకరించింది పెస్టిసైడ్స్ కోసం విశ్లేషించింది. ఇందులో అయిదు శాంపిల్స్ ఎలక్లోర్, మలాధియాన్ లతో కలుషితమయి ఉన్నాయి. ఇక సెప్టెంబర్ లో శంషాబాద్, మెహిదీ పట్నం,కొత్తపేట మార్కెట్ ల నుంచి 25 క్యాబేజీ శాంపిల్స్ సేకరించారు. ఇందులో రెండింటిలో పైరాక్లోస్టోబ్రిన్, నొవాల్యూరన్ అవశేషాలుకనిపించాయి. ఆగస్టులో శంషాబాద్, మెహిదీ పట్నం, డెయిరీ ఫామ్ నుంచి 27 శాంపిల్స్ సేకరించారు. ఇందులో అయిదింటిలో కార్బండాజిమ్, మెటాలాక్సైల్, ధయోఫినైట్ మిథైల్,ఇండాక్సకార్బ్, నోవాల్యూరాన్, ఈధియాన్ కాలుష్యం కనిపించింది. ఇక జూలై మెహిదీ పట్నం,శంషాబాద్ లనుంచి 15 శాంపిల్స్ కాప్సికల్ సేకరించి పరిశీలిస్తే అందులో అన్నింటిలో ఎసిఫేట్, కార్బెండాజిమ్, ఇమిడాక్లోప్రిడ్, ఫ్లూసిలాజోల్,ట్రైసైక్లజోల్, వంటి కెమికల్స్ కనిపించాయి. ఇలాగే జూన్ లో సేకరించిన 20 నమూనాలలో 9 శాంపిల్స్ లో రసాయన అవశేషాలు కనిపించాయి.
ఇదే విధంగా 2018 మే నెలలో 14 కాలిఫ్లవర్ నమూనాలను సేకరించారు. ఇందులో పదింటిలో ఆరు రకాల ప్రమాదకరమయిన పురుగుల మందులు కనిపించాయి. ఏప్రిల్ సేకరించిన 10 నమూనాలలో మూడింటిలో రసాయన అవశేషాలు కనిపించాయి. ఇక మార్చిలో మెహిదీ పట్నం, హైదర్ గూడ, మోండా మార్కెట్లలో సేకరించిన నమూనాలు మాత్రం స్వచ్ఛంగా ఉన్నాయి. ఎలాంటి అవశేషాలు కనిపించలేదు. ఇక ఫిబ్రవరిలో సేకరించిన 71 శాంపిల్స్ 29లో జనవరి పరీక్షించిన 48 శాంపిల్స్ లో 17లో పురుగుల మందులు అవశేషాలు కనిపించాయని టైమ్సాఫ్ ఇండియాలో ఒక రిపోర్టు వచ్చింది.
ఈ రసాయనాలు తక్కవ మోతాదులో ఉన్న పుడు తక్షణం హాని చేయవని, అయితే దీర్ఘ కాలంలో మాత్రం నరాల మీద ప్రభావం చూపిస్తాయని హైదరాబాద్ అపోలోకు చెందిన వైద్యుడు డాక్టర్ బూరుగు హరికిషన్ అంటున్నారు.