మూడు రాజధానుల విషయంలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం చెయ్యాల్సిందంతా ఇప్పటికే చేసేసింది. అయితే, ప్రస్తుతం ఆ వ్యవహారం కోర్టు పరిధిలోకి వెళ్ళింది. హైకోర్టు స్టేటస్ కో ఆదేశాల నేపథ్యంలో ‘త్రీ క్యాపిటల్స్’ వ్యవహారం ముందుకు వెళ్ళలేకపోతోంది. అయితే, తెరవెనుక వైఎస్ జగన్ ప్రభుత్వం, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసం అవసరమైన ‘మంత్రాంగం’ రచిస్తోందన్న వాదనలూ లేకపోలేదు. గెస్ట్ హౌస్ నిర్మాణం సహా, పలు అంశాలపై వైఎస్ జగన్ సర్కార్ ముందడుగు వేస్తోంటే, కోర్టుల్లో చిక్కులు ఎదురవుతున్నాయి.
మతిలేని నిర్ణయం ఎవరిది.?
తాజాగా, రాష్ట్ర హైకోర్టు.. రాజధాని తరతలింపుని మతలేని చర్యగా అభివర్ణించినట్లు ఓ సెక్షన్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇంకోపక్క వైసీపీ అనుకూల మీడియాలో కథనాలు ఇంకోలా వున్నాయి. పాలనా పరమైన నిర్ణయాల్లో జోక్యం తగదన్నట్లుగా ప్రభుత్వ వాదన న్యాయస్థానంలో వుందట. ఇది ముమ్మాటికీ తుగ్లక్ చర్యేనని ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా వాదనలు న్యాయస్థానాల్లో జరుగుతున్నాయి. ఆయా వాదనల్లో ‘ఖచ్చితత్వం’ ఎంత.? అన్నదానిపై న్యాయస్థానాల తీర్పులు వుంటాయి.
అమరావతి.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.!
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారైంది అమరావతి పరిస్థితి. చంద్రబాబు హయాంలో నిర్మితమైన సచివాలయం, అసెంబ్లీ భవనాలు, హైకోర్టు.. ఇంకొన్ని భవనాలు మినహా, ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం ఏ నిర్మాణాన్నీ ముందుకు తీసుకెళ్ళలేదు. మూడు రాజధానుల విషయమై వైఎస్ జగన్ ప్రభుత్వం స్పష్టతోనే వుండి వుంటే, కనీసం అమరావతిలో అయినా నిర్మాణాలు కొనసాగించి వుండొచ్చుకదా.. అన్నది ఇంకో వాదన.రోజులు గడిచిపోతున్నాయ్.. మూడు రాజధానులపై అధికారికంగా నిర్ణయం జరిగిపోయి ఏడాది కావొస్తోంది. ఏడాది కాలం అంటే ఏ ప్రభుత్వానికైనా అత్యంత విలువైనదే. ఇంత సమయం వృధా అవడమంటే ఖచ్చితంగా అది అధికార పార్టీపై కొంత నెగెటివిటీని క్రియేట్ చేస్తుంది. మరి, ఈ పరిస్థితుల్లో ఇంకా ‘తెగేదాకా’ లాగడం అన్న మాటకే అధికార పార్టీ కట్టుబడి వుంటుందా.? మధ్యే మార్గం.. అన్నట్లుగా ఇంకేదైనా ఆలోచన చేస్తుందా.? అన్నది వేచి చూడాల్సిందే.