అమరావతిలో శాసన రాజధాని కూడా ఉండటానికి వీల్లేదంటూ బాంబు పేల్చిన మంత్రి కొడాలి నాని ఇదే విషయమై తన మాటల యుద్దం మరింత ముమ్మరం చేశారు. అమరావతి విషయంలో తాను చెప్పినట్లు చేస్తే రాజీనామా చేసేందుకు సైతం సిద్దమని సవాలు విసిరారు. తద్వారా అమరావతిపై అమీతుమీ తేల్చుకునేంత వరకు తాను ఈ విషయాన్ని వదిలేదిలేదని వారికి హెచ్చరికలు చేసినట్లయింది. అయితే అమరావతి విషయంలో ఉద్యమాలు, న్యాయపోరాటాలు చేస్తున్న భూములు ఇచ్చిన రైతుల విషయంలో మీకు అన్యాయం జరగదంటూ ఇటీవలి వరకు నచ్చచెప్పే ధోరణిలో ముందుకు వెళ్లిన వైసిపి ఇప్పుడు రూటు మార్చిందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మంత్రి కొడాలి నాని మరింత దూకుడు
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకున్నఅమరావతిలో శాసన సభ ఉండకూడదని సిఎంతో చెప్పినట్లు ప్రకటించి సంచలనం సృష్టించిన మంత్రి కొడాలి నాని ఇప్పుడు ఏకంగా అమరావతి విషయంలో తాను రాజీనామా చేసేందుకు సైతం సిద్దమని ప్రత్యర్థులకు సవాలు విసిరారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మీరు సహకరిస్తే వెనువెంటనే తాను మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్దమని, తాను పదవులు లెక్కచేయనని అన్నారు. టిడిపి ప్రభుత్వం ఒక సింగపూర్ కంపెనీకి 15 వేల ఎకరాలు భూములు ఇవ్వొచ్చుగాని తమ ప్రభుత్వం 50 వేల మంది రైతులకు 15 వేల ఎకరాలు ఇస్తే తప్పవుతుందా? అని ప్రశ్నించారు. అంతేకాదు రాజధాని పై నిర్ణయం రాష్ట్రానిదేనని కేంద్ర ప్రభుత్వం కూడా తేల్చేసిందని, కాబట్టి రైతులు కూడా టిడిపి మాటలు విని నష్టపోవద్దని సూచించారు. రాజధాని రైతులు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి డిమాండ్ల పరిష్కరించుకోవాలని బాల్ ను వారి చేతుల్లోనే పెట్టేశారు.
ఒకరు అలా…మరొకరు ఇలా
అయితే అమరావతిపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపగా మరోవైపు ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా గుర్తింపు పొందిన మరో మంత్రి ఆదిమూలపు సురేష్ తాజా వ్యాఖ్యలు పరిస్థితిని మరింత గందరగోళంగా మార్చేశాయి. ముఖ్యమంత్రి జగన్ ముందు ప్రకటించిన విధంగా మూడు రాజధానులకే కట్టుబడి ఉందని, ఆ విషయంలో మరో నిర్ణయం ఉండదని స్పష్టం చేశారు. ఒకవైపు మంత్రి కొడాలి నాని తాను అమరావతిలో శాసన సభ కూడా వద్దంటూ సిఎం జగన్ తో చెప్పగా ఆయన సానుకూలంగా స్పందించి అందరితో చర్చించి నిర్ణయం తీసుకుందామని అన్నారని చెబుతుండగా, మరోమంత్రి ఆదిమూలపు సురేష్ మూడు రాజధానులే సిఎం అభిమతమంటూ చెప్పడం ఇది ఖచ్చితంగా వైసిపి మైండ్ గేమ్ గానే భావించాలని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మంత్రి ఆదిమూలం సురేష్ చెప్పిందే నిజమైతే మరి మంత్రి కొడాలి నాని అమరావతి విషయమై కొత్త కొత్త సవాళ్లు విసరడం దేనికంటున్నారు.
వైసిపి కొత్త మైండ్ గేమ్
అమరావతిని టాకిల్ చేసే విషయమై వైసిపి కొత్త వ్యూహం సిద్దం చేసుకుందని, తదనుగుణంగానే కొడాలి నాని ఉన్నట్టుండి అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఈ అంశాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే మంత్రి కొడాలి నాని ఇదే విషయమై మళ్లీ మళ్లీ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తుండగా, మరోవైపు మరో మంత్రి ఆదిమూలపు సురేష్ అందుకు విరుద్దంగా మాట్లాడటం విస్మయం కలిగిస్తోంది. వైసిపి మంత్రులే ఇలా పరస్పర విరుద్దమైన ప్రకటనలు చేయడం ద్వారా ఖచ్చితంగా వైసిపి కొత్త మైండ్ గేమ్ మొదలెట్టిందని అర్థం చేసుకోవాలంటున్నారు.
ప్రత్యర్థుల ప్రతిస్పందన ఇదే
అయితే మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై టిడిపి శ్రేణులు ధీటుగానే ప్రతిస్పందించాయి. మంత్రి కొడాలి నాని చెప్పిన విధంగానే అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సహకరిస్తామని అప్పుడు అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగిస్తారా? అని నిలదీస్తున్నారు. వారు కోరిన విధంగా తాము చేసినప్పుడు తాము కోరింది వారు చేయాలిగా అంటూ తాజా పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు అమరావతిలో శాసన సభ కూడా లేకుండా ఏ విధంగా ఇక్కడి రైతులకు న్యాయం చేస్తారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. వైసిపి ప్రభుత్వం వ్యవహారం అంతా పిచ్చోడి చేతిలో రాయిలా ఉందనడానికి ఇలాంటి గందరగోళపు నిర్ణయాలే నిదర్శనం అంటున్నారు. ఏదేమైనా తాజాగా అమరావతిపై రేగిన రగడ మరింత ముదరడం ఖాయంగా కనిపిస్తోంది.