కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారా?

గత కొద్ది నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో వినిపిస్తున్న గుసగుసల్లో రాష్ట్ర ఐటి మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు రాబోయే మార్చ్ నెల తరువాత ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్నారని!  సాదా సీదా వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.  కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు, కొందరు మంత్రులు సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తుండటం కొంత అనుమానం కలిగిస్తుంది.  
 
Will KTR become Chief Minister?
Will KTR become Chief Minister?
నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికీ తెలంగాణాలో తిరుగులేని నాయకుడే.  ఒకటి రెండు ఎన్నికల్లో పార్టీ ఓటమి చవిచూసినంతమాత్రాన కేసీఆర్ బలహీనపడుతున్నారని చెప్పడానికి ఆధారాలు ఏమీ లేవు.  కేసీఆర్ లేకపోతె తెలంగాణ లేదు అని బలంగా విశ్వసించేవారు తొంభై తొమ్మిది శాతం ఉంటారు.  పైగా పార్టీని అదుపులో ఉంచాలన్నా, సమయానుకూలంగా జవజీవాలు నింపాలన్నా కేసీఆర్ ను మించిన నాయకుడు తెరాసలో మరొకరు లేరు.  పార్టీలో కేసీఆర్ పట్ల వ్యతిరేకత లేదు.  కాస్తో కూస్తో అసంతృప్తి కొందరికి ఉంటే ఉండవచ్చు కానీ నాయకత్వ మార్పు కోరుకునేవారు ఒక్కరు కూడా ఉండరు.  తెలంగాణ రాష్ట్ర సాధకుడుగా కేసీఆర్ పేరు శాశ్వతం.  కేసీఆర్ బలమైన నాయకత్వం లేకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రం సంభవం అయ్యేదే కాదని రెండు తెలుగు రాష్ట్రాలవారూ నమ్ముతారు.  
 
మరి ఈమధ్య కాలంలో ఎందుకని ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తున్నాయి.  విచిత్రం ఏమిటంటే వాటిని కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ ఖండించడం లేదు.  అటు అంగీకరించడం లేదు.  కేసీఆర్ తరువాత ఆ స్థానాన్ని అధిరోహించే అర్హత కేటీఆర్ కు కచ్చితంగా ఉన్నదనడంలో సందేహం ఎవ్వరికీ లేదు.  కేసీఆర్ ఆరోగ్యానికి వచ్చిన ఢోకా కూడా ఏమీ లేదు.  మొన్ననే ఆయనకు చేసిన ఆరోగ్య పరీక్షల్లో ఆయన నూటికి నూరు శాతం ఫిట్ గా ఉన్నారని వైద్యులు కూడా ధృవీకరించారు.  
 
పోనీ రాష్ట్ర బాధ్యతను కేటీఆర్ కు అప్పగించి కేసీఆర్ ఢిల్లీ రాజకీయాల్లో బిజీ అయ్యే అవకాశం ఉన్నదా అంటే అది కూడా కనిపించడం లేదు.  మోడీ నాయకత్వంలో బీజేపీ చాలా బలంగా ఉన్నది.  రాబోయే సాధారణ ఎన్నికల్లో కూడా బీజేపీదే విజయం అని రాజకీయపరిశీలకులు బల్లగుద్ది చెపుతున్నారు.  మూడో ఫ్రంట్ కు రాబోయే ఎన్నికల్లో అవకాశం కనిపించడం లేదు.  కాబట్టి జాతీయ రాజకీయాల్లో కూడా కేసీఆర్ నిర్వహించాల్సిన పాత్ర ఏమీ లేదు.  
 
రాష్ట్రంలో పరిపాలన బాగానే ఉన్నది.  కాకపొతే కేసీఆర్ చేపట్టిన కొన్ని రెవిన్యూ సంస్కరణలకు వ్యతిరేకత కనిపిస్తున్నది.  నిజానికి ఇలాంటి సంస్కరణలు సినిమాలో జరిగితే ఈలలు చప్పట్లు కొడతారు.  హీరో మీద పూలవాన కురిపిస్తారు.  అదేపని నిజజీవితంలో చేయబోతే కేసీఆర్ కు ప్రతిఘటన ఎదురవుతున్నది.  అవినీతికి తావులేని రెవిన్యూ వ్యవస్థ కావాలని కేసీఆర్ సంకల్పించడం ముమ్మాటికీ అభిలషణీయమే.  కానీ ఆ సంస్కరణలను గట్టిగా అమలు చేస్తుంటే ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు.  ఎందుకంటే వారి అవినీతి సాగదు గదా!  
 
ఏదేమైనా కేసీఆర్ తిరుగులేని ప్రజారంజక పరిపాలకుడు.  సర్దుకుని పోయే మనస్తత్వం కలిగినవాడు.  సంక్షేమ పధకాలను నిరంతరాయంగా అమలు చేస్తున్నారు.  ఆయనే మరోసారి కూడా ముఖ్యమంత్రి కావాలని అనేకమంది అభిలషిస్తున్నారు.  ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా ప్రాజెక్ట్ చేయడం వెనుక ఏదైనా మర్మం ఉన్నదా?   గతంలో ఎన్నడూ వినని పదాలు ఇప్పుడు తెరాసలో వినపడుతున్నాయి. కేసీఆర్ వర్గం, కేటీఆర్ వర్గం, హరీష్ రావు వర్గం, కవిత వర్గం అంటూ చీలికలు అంటున్నారు.  నిజానికి ఇలాంటి పుకార్లను హరీష్ రావు సైతం అనేకమార్లు ఖండించారు.  ఇలాంటి వర్గపోరుకు స్వస్తి పలికే పధకం ఏమైనా ఉన్నదా అని చాలామంది సందేహం.  
 
చాలామంది తెరాస అభిమానులు చెప్పేది ఏమిటంటే “కేసీఆర్ జీవించి ఉన్నంతకాలం ఆయనే పార్టీకి సుప్రీమ్.  ఆయనే ముఖ్యమంత్రి.  ఆయన స్థానంలో మరొకరిని ఊహించడానికి కూడా ఒప్పుకోము.  ఈ వర్గ విభజనలు, పోటీలు అన్నీ ఊహాగానాలే”.  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు