ఎట్టి పరిస్థితుల్లోనూ 175 నియోజకవర్గాలకుగాను మొత్తంగా 175 నియోజకవర్గాల్నీ గెలిచి తీరతామని అంటున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 2024 ఎన్నికల్లో విజయం తమ పార్టీదేనని వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాదాపు అన్ని బహిరంగ సభల్లోనూ ఈ మధ్య నినదిస్తున్న సంగతి తెలిసిందే.
‘దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో నాలుగేళ్ళ క్రితం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు అప్పగించిన బాధ్యతను, మీకు సేవ చేసే అవకాశంగా భావించి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మన ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా అమలు చేశాం. మరోసారి మీకు సేవ చేసే అవకాశం లభించేందుకు వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలో గెలుపొందేలా అడుగులు వేస్తున్నాం’ అంటూ ట్వీటేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా.
వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళవుతున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ హ్యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో వుందిప్పుడు.
అయితే, వైసీపీ నుంచి ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ జారిపోయారు. ఎక్కడికక్కడ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోతున్నా వాటిని కంట్రోల్ చేసే యంత్రాంగమే లేకుండా పోతోంది. ఇంకోపక్క, సీనియర్లేమో తమకు సీట్లు వద్దంటూ అధినేతకు తేల్చి చెప్పేస్తున్నారు. అయినాగానీ, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం, వచ్చే ఎన్నికల్లో నూటికి నూరు శాతం అన్ని నియోజకవర్గాల్లోనూ గెలిచి తీరతామని అంటున్నారు.