రాజకీయాల్లో విమర్శలు మామూలే. ఓ పార్టీ మీద ఇంకో పార్టీ విమర్శలు చేయడం, ఓ నాయకుడి మీద మరో నాయకుడు విరుచుకుపడటం అనేది ఎప్పటినుంచో చూస్తూనే వున్నాం. అయితే, అవిప్పుడు హద్దులు దాటుతున్నాయి. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు, నాయకులు హద్దులు దాటేయడం మునుపెన్నడూ లేని రీతిలో కనిపిస్తోంది. అందరూ కలిసి హైద్రాబాద్ ప్రశాంతతను చెడగొడుతున్నారా.? అన్న చర్చ సాధారణ ప్రజానీకంలో జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో నేతల మాటలు హద్దులు దాటుతున్నాయి.. మరి, డిసెంబర్ 4న ఫలితాలు వచ్చాక ఏం జరగనుంది.?
మజ్లిస్ కొత్త పార్టీనా.?
మజ్లిస్ (ఐఎఎంఐఎం) కొత్త పార్టీ కాదు. మజ్లిస్ పార్టీ రాజకీయాలూ కొత్త కాదు. కానీ, గతంలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో మజ్లిస్ మీద బీజేపీ విమర్శలు చేస్తోంది. మజ్లిస్, తన మిత్రపక్షం టీఆర్‌ఎస్‌ని కూడా విడిచిపెట్టడంలేదు. నేతల మాటలు ‘కూల్చివేతల’ వరకూ వెళ్ళాయి. హుస్సేన్ సాగర్ పక్కనే వున్న పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్. ‘వాటి జోలికి వెళితే ఖబడ్దార్..’ అంటోంది బీజేపీ. ఈ జోరు చూస్తోంటే, డిసెంబర్ 4 తర్వాత విపరీత పరిణామాల్ని గ్రేటర్ హైద్రాబాద్‌లో చూడాల్సి వస్తుందేమోనన్న ఆందోళన ప్రజల్లో కలగడం సహజమే.
ఎన్నికల్లో గోల.. ఎన్నికలయ్యాక డీలా.!
ఎన్నికల్లో రాజకీయ పార్టీలు రెచ్చిపోవడం మామూలే. ప్రచారం ముగిశాకనే ఆయా పార్టీలకీ, నేతలకీ అలసట తెలిసొస్తుంది. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల ఫలితాలొచ్చాక, అంతా ఆయాసంతో నీరసించిపోతేనే మంచిది. నీరసం వచ్చినా రాకపోయినా, సంయమనం పాటిస్తే ఎవరికీ ఎలాంటి సమస్యలూ వుండవు. రాజకీయాలు ఎన్నికలొచ్చినఫ్పుడే వుండాలి. ఆ తర్వాత రెచ్చగొట్టుకునే వ్యాఖ్యలు కొనసాగిస్తే పరిస్థితులు ప్రమాదకరంగా మారతాయి.
చేతులెత్తేస్తోన్న అధికార టీఆర్‌ఎస్
అధికార టీఆర్‌ఎస్, ఈ పోరులో చేతులెత్తేస్తోన్నట్లే కనిపిస్తోంది. ‘మా పోరాటం మజ్లిస్‌పైనే..’ అని బీజేపీ ముందుగానే చెప్పేసింది. టీఆర్‌ఎస్ – మజ్లిస్ మిత్రపక్షాలుగానే తెరవెనుకాల కొనసాగుతున్నా, పైకి ఒకర్ని ఒకరు తిట్టుకుంటున్నారు. ఈ సందట్లో కాంగ్రెస్, టీడీపీ అసలు సోదిలోకి కూడా లేకుండా పోవడం గమనార్హం.
ఏదిఏమైనా, పోలింగ్ రోజుతోనే ఈ గొడవలన్నీ సద్దుమణిగిపోవాలి. డిసెంబర్ 4న ఫలితాలొచ్చేవరకూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగడం ఎవరికీ మంచిది కాదు. అది హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కే పెద్ద మచ్చ అయిపోయే ప్రమాదముంది మరి.