చిన్నపాటి అలజడి.. డీఆర్సీ సమావేశంలో చిన్నపాటి గలాటా చోటు చేసుకుందట. ఎమ్మెల్యేల అనుచరులు భూ కబ్జా వార్తల్లోకెక్కుతున్నారట.. ఎమ్మెల్యేలు, తమ అనుచరుల్ని అదుపులో వుంచుకోవాలని రాజ్యసభ సభ్యుడు పరోక్షంగా సూచించారట. ఇలా మీడియాలో వార్తలొచ్చేసరికి, ఒక్కసారిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అలజడి రేగింది. వైసీపీలో నెంబర్ టూ ఎవరంటే విజయసాయిరెడ్డి పేరే వినిపిస్తుంటుంది. పైగా, ఉత్తరాంధ్ర వైసీపీ వ్యవహారాల్ని చక్కబెట్టేది విజయసాయిరెడ్డి మాత్రమే. అన్నిటికీ మించి, ఆయన వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.
ముఖ్యమంత్రి ఆదేశం.. ఎమ్మెల్యేలతో విజయసాయి సమావేశం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశించిన దరిమిలా, వైసీపీ ఎమ్మెల్యేలతో విజయసాయిరెడ్డి సమావేశమయ్యారు. చాలా సేపే ఈ సమావేశం జరిగింది. సమావేశంలో ఏం జరిగిందనే విషయం మాత్రం బయటకు పొక్కలేదు. కానీ, అసలు వివాదమే లేదంటూ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి స్పష్టం చేసేశారు. అయితే, ‘ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదంటే, సమస్యల పట్ల ప్రజా ప్రతినిథులుగా మేమూ స్పందించాలి కదా..’ అంటూ మరో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వ్యాఖ్యానించారు. అధికారుల విషయమై పంచాయితీ నడించిందనే విషయం కరణం ధర్మశ్రీ మాటల్ని బట్టి అర్థమవుతోంది.
వివాదం సద్దుమణిగిపోయినట్లేనా.?
అసలు వివాదమే లేనప్పుడు, వివాదం సద్దుమణగడమన్న ప్రశ్న ఎలా వస్తుంది.? అని కరణం ధర్మశ్రీ, అమర్‌నాథ్‌రెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. దాంతో, విశాఖలో తీరం దాటలేకపోయిన ‘టీ కప్పులో తుపాను’ అంటూ విశాఖ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. కానీ, విషయం నివురుగప్పిన నిప్పులానే వుందనే ప్రచారం తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి జోరుగా సాగుతోంది. సమావేశం తర్వాత విజయసాయిరెడ్డిలో ‘జోరు’ కనిపించకపోవడమే ఇందుకు నిదర్శనమన్నది టీడీపీ అనుకూల మీడియా అభిప్రాయం.
ఎలాగైతేనేం, ముదిరి పాకాన పడుతుందనుకున్న విశాఖ వైసీపీలో అలజడి సింపుల్‌గా సైలెంటయిపోయింది. పార్టీ అన్నాక అభిప్రాయ బేధాలు మామూలే. ఏ పార్టీకి అయినా ఇలాంటివి తప్పవు. ఇలాంటి విషయాలు తెరపైకొచ్చినప్పుడు సకాలంలో అధిష్టానం తగిన చర్యలు తీసుకుంటే, అంతకన్నా కావాల్సిందేముంది.?