తొడకొడుతున్న టీఆరెస్ పార్టీ 

trs party ready to face ghmc elections
మొన్న జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో వెంట్రుకవాసిలో విజయాన్ని చేజార్చుకున్న తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ మరికొద్ది నెలల్లో జరగబోయే హైదరాబాద్ నగర పాలకమండలి ఎన్నికలకు వెళ్ళడానికి వెనుకాడుతుందని, మళ్ళీ పరిస్థితులు తమకు అనుకూలంగా వచ్చాయని నమ్మిన తరువాత మాత్రమే ఎన్నికలు జరుపుతారని సామాన్య ప్రజలే కాక రాజకీయ పండితులు కూడా అంచనా వేశారు.  దుబ్బాక ఇచ్చిన విజయంతో ఉత్తేజితంగా ఉన్న బీజేపీ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఆత్రుత ప్రదర్శిస్తున్నది.  దుబ్బాక ఎన్నిక ముందు తమ సర్వేలో కార్పొరేషన్ ఎన్నికల్లో డెబ్బై సీట్లు వస్తాయని తేలిందని,  కానీ ఇప్పుడు వంద సీట్లు గెలుచుకుంటామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమరోత్సాహంతో ప్రకటించారు.  
 
trs party ready to face ghmc elections
trs party ready to face ghmc elections
అయితే దుబ్బాక ఉపఎన్నిక పరాజయాన్ని టీఆరెస్ పెద్ద సీరియస్ గా తీసుకోలేదు.  అక్కడ మరణించిన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్యను అభ్యర్థిగా ఎంపిక చెయ్యడంలో ప్రధాన ఉద్దేశ్యం  ఆ కుటుంబానికి మద్దతుగా నిలబడాలనే కోరిక తప్ప మరొకటి కాదని, అలాగే భాజపా అభ్యర్థి రఘునందన్ రావుకు ఆమె దీటైన  అభ్యర్థి కారని తమకు తెలుసనీ, అయినప్పటికీ శక్తివంచన లేకుండా పోరాడామని టీఆరెస్ భావిస్తున్నది.  అంతేకాకుండా, అక్కడ స్వతంత్ర అభ్యర్థులు ఇరవై మంది పోటీలో ఉన్నారు.  వారికి రమారమి పదిహేడు వేల ఓట్లు పోలయ్యాయి.  వారిలో నలుగురైదుగురు అభ్యర్థులతో రాజీ కుదుర్చుకుని ఉన్నా, విజయం తమకు దక్కేదని టీఆరెస్ అభిప్రాయంగా ఉన్నట్లు చెబుతున్నారు.  బీజేపీ అభ్యర్థికి లభించిన విజయం తమకు గతంలో లభించిన ఘనవిజయం లాంటిది కాదని, చావుతప్పి కన్ను లొట్టపోయిన బాపతు విజయం అని టీఆరెస్ అంతరంగంగా భావిస్తున్నారు. ఈ ఉపఎన్నికలో బీజేపీ భారీవిజయాన్ని నమోదు చేసి ఉన్నట్లయితే టీఆరెస్ తప్పకుండా ఆత్మరక్షణలో పడిపోయేది. ఆయన గతంలో రెండుసార్లు ఓడిపోయారనే సానుభూతి, వయసులో చిన్నవాడు కావడం, ఒక సీటు ప్రతిపక్షానికి దక్కినంతమాత్రాన అధికారపార్టీకి వచ్చే ప్రమాదం ఏమీ లేదని నియోజకవర్గ ప్రజలు భావించడం రఘునందన్ రావు విజయానికి కారణంగా టీఆరెస్ విశ్లేషిస్తున్నది. ఇంకా చెప్పాలంటే ఇది రఘునందనరావు వ్యక్తిగత విజయమే తప్ప బీజేపీ విజయం కాదని టీఆరెస్ అధిష్ఠానము నమ్ముతున్నది. అందుకే రాబోయే నెలలో ఎన్నికలు జరిపినా తాము సిద్ధం అని టీఆరెస్ సమరభేరిని మోగించింది.  
 
ఇక బీజేపీ ఆశలు ఏమిటంటే ఇటీవల సంభవించిన వరదల కారణంగా నగరవాసులు దుర్భరమైన ఇబ్బందులు పడ్డారని,  అనేక కాలనీలు వరదముంపుకు గురైనపుడు ప్రభుత్వం సరిగా స్పందించలేదని, నాలుగైదు రోజుల దాకా వారికి ఆహారసరఫరా కూడా అధికారులు చేయలేకపోయారని, అందువలన ప్రజలు తమ వ్యతిరేకతను కార్పొరేషన్ ఎన్నికల్లో చూపిస్తారని.  బీజేపీ ఎత్తులు ముందుగానే గ్రహించిన కేసీఆర్ వరద ముంపు బాధితుల కుటుంబాలకు అయిదు వందల యాభై కోట్ల రూపాయలను కేటాయించి కుటుంబానికి పదివేల రూపాయల వంతున సాయంగా అందించారు.  అయితే ఈ సహాయంలో కూడా కొందరు ప్రజాప్రతినిధులు చేతివాటాన్ని ప్రదర్శించారని ఆరోపణలు వినిపించాయి.  ఏదైనా ప్రభుత్వం నుంచి కొన్ని కుటుంబాలకు ఆర్థికసాయం అందిందనే మాట వాస్తవం.  
 
ఇక బీజేపీ గనుక కార్పొరేషన్ చేజిక్కించుకుంటే నగరంలో మతకలహాలు సృష్టించి, శాంతిభద్రతల సమస్య సృష్టిసారని, అసలైన అధికారం కలిగిన ప్రభుత్వం నగరంలోనే కొలువుదీరి ఉండటం వలన బీజేపీ గనుక ప్రభుత్వంతో ఘర్షణ వాతావరణాన్ని అవలంబించే పక్షంలో నగర అభివృద్ధి కుంటుపడుతుందని, కాబట్టి టీఆరెస్ నే గెలిపించాలని టీఆరెస్ ప్రచారం చేయబోతున్నది.  మరి ప్రజల మనోగతం ఎలా ఉంటుందో ఎన్నికలు జరిగితేనే కానీ తెలియదు.   కానీ, ఈ ఎన్నికలు కేటీఆర్ సమర్ధతకు పరీక్ష కాబోతున్నాయి అనేది సత్యం.  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు