మరణశాసనాన్ని లిఖించుకున్న కాంగ్రెస్ పార్టీ 

The Congress party slipped to third place after the Dubaka election
నిన్నో మొన్నో హైదరాబాద్ నగర కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా వెలువడిన ఒక సర్వేలో కాంగ్రెస్ పార్టీకి ఒకటో రెండో సీట్లు వస్తాయని తేలిందట!  ఎలాంటి కాంగ్రెస్ పార్టీ ఎలా పతనమై పోయిందో తలచుకుంటేనే బాధ కలుగుతుంది.  దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ, యాభై ఏళ్లపాటు భారతదేశానికి దిశానిర్దేశం చేసినపార్టీ…చివరకు పనికిమాలిన శుద్ధ బుద్ధావతారాల నాయకత్వంలో భూస్థాపితమై పోవడానికి సిద్ధమైంది.  మొన్న మొన్నటిదాకా తెలంగాణాలో రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దుబ్బాక ఎన్నిక తరువాత మూడోస్థానానికి దిగజారిపోయింది.  డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని దుస్థితికి దిగజారిపోయింది.  
The Congress party slipped to third place after the Dubaka election
The Congress party slipped to third place after the Dubaka election
 
తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ కన్నా, తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆరెస్ పార్టీ ప్రభావాన్ని ఏమాత్రం నియంత్రించలేకపోయింది.  కేసీఆర్, కేటీఆర్ లాంటి వాక్పటిమ కలిగిన నాయకుల ధాటికి తట్టుకోలేక వెలవెలపోయింది.  చేవచచ్చిన, ఎముకలు కుళ్ళిన  వృద్ధ నాయకత్వం, ప్రజల్లో ఏమాత్రం ఆదరణ లేని జీవరహిత నాయకులు,  ఒక సభ పెట్టి పదిమందిని కూడా సమీకరించలేని అసమర్ధులు, సుఖలాలసులైన నాయకులు కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేశారు.  శాసనసభ ఎన్నికల్లో అత్యంత దారుణ పరాజయాన్ని అందించిన ఉత్తమ్ కుమార్ స్థానంలో మరొక యోగ్యుడైన నాయకుడిని కాంగ్రెస్ పార్టీ అన్వేషించలేకపోయింది.   ఓటుకు నోటు కేసులో దొరికిపోయి చంద్రబాబు నాయుడు అమరావతికి పారిపోవడానికి కారకుడైన   రేవంత్ రెడ్డికి కాంగ్రెస్  పగ్గాలు అప్పగిస్తారనే వార్తలు వస్తున్నాయంటేనే ఆ పార్టీ పాతాళ కుహరాలకు బాటలు వేసుకుంటున్నదని తేలిపోయింది.  కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డిని తమ నాయకుడు అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ధైర్యం చెయ్యలేకపోతున్నది!  వైఎస్ బొమ్మ చూపితే హైద్రాబాద్ లోని సీమాంధ్రులు కొందరైనా ఓట్లు వేస్తారని కొందరు శ్రేయోభిలాషులు సలహా ఇస్తున్నప్పటికీ, జగన్ మీద ఉన్న ద్వేషంతో కాంగ్రెస్ పార్టీ అలాంటి పని చెయ్యలేకపోతున్నది.  జగన్ మీద కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానం ఉన్నప్పటికీ సోనియా, రాహుల్ గాంధీలకు భయపడి బాహాటంగా వ్యక్తం చేయలేకపోతున్నారు.  జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకుని కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద పొరబాటు చేసిందని కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు బహిరంగంగానే వాపోతున్నారు.  కాస్తో కూస్తో బలం ఉందన్న తెలంగాణలోనే కాంగ్రెస్ పరిస్థితి ఇంత దయనీయంగా మారిందంటే ఆ పార్టీ నాయకత్వమే వారికి పెనుశాపం.  కాంగ్రెస్ వ్యవస్థ కుప్ప కూలిందని నిన్న ఆ పార్టీ అగ్రనేత గులాం నబీ ఆజాద్ చేసిన ప్రకటన అక్షర సత్యం.  
 
తెలంగాణాలో కాంగ్రెస్ స్థానంలో బీజేపీ శరవేగంగా పుంజుకుంటున్నది.  సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు, దుబ్బాక ఉపఎన్నికలో ఎమ్మెల్యే స్థానం దక్కించుకుని కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద సవాలును విసిరింది.  ఆ సవాలును స్వీకరించి పార్టీకి జీవం పోస్తామని ధైర్యంగా ప్రకటించే నాయకత్వమే కాంగ్రెస్ పార్టీలో దుర్భిణీ వేసి గాలించినా కనిపించడం లేదు.  ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణంగా అంత్యక్రియలు జరిపించుకున్న కాంగ్రెస్ పార్టీ త్వరలో తెలంగాణాలో కూడా ఆ పనికి సిద్ధంగా ఉన్నది.  ఒక సీనియర్ నాయకుడి మాటల్లో చెప్పాలంటే “వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంతో కాంగ్రెస్ పార్టీ మూడు వంతులు చచ్చింది.  జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకోవడంతో మిగిలిన వంతు కూడా చచ్చిపోయింది.  ప్రజలను ఆకట్టుకోగల నాయకులు కాంగ్రెస్ పార్టీలో లేరు.  ఇప్పుడున్న వృద్ధ నాయకులు అందరినీ తరిమేసి పాతికేళ్ల వయసు కలిగిన  యువ నాయకత్వాన్ని తయారు చెయ్యకపోతే రాబోయే ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీ సమాధి కావడం ఖాయం”!
 
చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవ! 
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు