భారత్ లో ఆడమన్న బంగ్లాదేశ్.. టీ20 వరల్డ్‌కప్‌ నుంచి తప్పిస్తామంటూ ఐసీసీ షాక్..!

టీ20 ప్రపంచకప్‌కు ముందే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. భద్రతా కారణాలను చూపుతూ భారత్‌లో మ్యాచ్‌లు ఆడలేమని బంగ్లాదేశ్ స్పష్టం చేయడంతో వివాదం ముదిరింది. తమ మ్యాచ్‌లను భారత్ నుంచి తరలించాలని, వీలైతే ఐర్లాండ్‌తో షెడ్యూల్ స్వాప్ చేయాలని ఐసీసీని బీసీబీ కోరింది. అయితే ఈ అభ్యర్థనకు ఐసీసీ నుంచి ఊహించని విధంగా కఠినమైన స్పందన వచ్చింది.

షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు ఉండవని ఐసీసీ తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై జరిగిన ఐసీసీ బోర్డు ఓటింగ్‌లో బంగ్లాదేశ్ ప్రతిపాదన 14-2 ఓట్ల తేడాతో తిరస్కరణకు గురైంది. హాజరైన 15 మంది డైరెక్టర్లలో కేవలం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రమే బీసీబీకి మద్దతుగా నిలిచింది. మిగతా బోర్డులు షెడ్యూల్ మార్పులకు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు సమాచారం.

ఓటింగ్ అనంతరం తీసుకున్న నిర్ణయాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఐసీసీ బీసీబీకి సూచించింది. భారత్‌లో ఆడటానికి బంగ్లాదేశ్ నిరాకరిస్తే, ప్రపంచకప్ నుంచి తొలగించి వారి స్థానంలో మరో జట్టును చేర్చుతామని స్పష్టమైన హెచ్చరిక కూడా జారీ చేసింది. ఇప్పటికే ప్రత్యామ్నాయంగా స్కాట్లాండ్ పేరును ఐసీసీ తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. తుది నిర్ణయం చెప్పేందుకు బంగ్లాదేశ్‌కు మరో రోజు గడువు మాత్రమే ఇచ్చినట్లు సమాచారం.

ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ కోల్‌కతాలో మూడు లీగ్ మ్యాచ్‌లు, ముంబైలో ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే వీటిని శ్రీలంకకు మార్చాలని బీసీబీ పట్టుబడుతోంది. ఐర్లాండ్ ఇప్పటికే తన లీగ్ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడుతుండటంతో స్వాప్ సాధ్యం కాదని ఐర్లాండ్ స్పష్టం చేసింది. దీంతో బంగ్లాదేశ్ అభ్యర్థన మరింత బలహీనంగా మారింది.

ఈ మొత్తం వివాదానికి నేపథ్యంగా రాజకీయ, సామాజిక ఉద్రిక్తతలు కూడా కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను తీసివేయడం, బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక ఘటనలపై భారత్‌లో వెల్లువెత్తిన నిరసనలు ఈ అంశాన్ని మరింత సున్నితంగా మార్చాయి. ఇదే సమయంలో భద్రత పేరుతో ప్రపంచకప్ నుంచి తప్పుకోవడం సరైంది కాదని ఐసీసీ స్పష్టంగా సంకేతాలు ఇచ్చింది.

ఫిబ్రవరి 7న టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ప్రతిష్టంభన ఎలా ముగుస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. బంగ్లాదేశ్ గ్రూప్ సీలో వెస్టిండీస్, ఇంగ్లాండ్, నేపాల్, ఇటలీతో కలిసి ఉంది. ఒకవేళ బీసీబీ తన వైఖరికి కట్టుబడి ఉంటే, స్కాట్లాండ్ ఆ గ్రూప్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ప్రపంచకప్‌కు ముందు బంగ్లాదేశ్ తీసుకునే తుది నిర్ణయం టోర్నమెంట్ రూపురేఖలనే మార్చేలా కనిపిస్తోంది.