బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ హత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, తాజాగా మరో హిందూ యువకుడు మూకదాడిలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. రాజ్‌బారి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతలకు దారితీసింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, రాజ్‌బారి జిల్లా పాంగ్షా ఉప జిల్లాలోని కాలిమోహర్ యూనియన్ హోసెన్‌డంగా గ్రామంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అమృత్ మండల్ అనే యువకుడిపై కొందరు వ్యక్తులు దాడి చేయగా, తీవ్ర గాయాలపాలైన అతడు అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనకు సంబంధించి అమృత్ మండల్ ఒక బెదిరింపుల కేసులో నిందితుడిగా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. అయితే, దాడి పరిస్థితులు, దాని వెనుక ఉన్న కారణాలపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని స్పష్టం చేశారు. పాంగ్షా సర్కిల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దేవ్రత సర్కార్ మాట్లాడుతూ, ఘటనకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని, అనుమానితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి అమృత్ సహచరుడిగా గుర్తించిన మహమ్మద్ సెలిమ్‌ను అరెస్ట్ చేసినట్లు, అతని వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
వరుసగా చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలు బంగ్లాదేశ్‌లో భద్రతా పరిస్థితులపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలి రోజుల్లో జరిగిన ఘటనలు మైనారిటీ వర్గాల్లో భయాందోళనలకు కారణమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తు పూర్తయ్యాక వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు రాజ్‌బారి జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.
