“ఎవడికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడ్చెరా” అన్నట్లు ఎప్పుడో ఏడున్నర దశాబ్దాల క్రితం ప్రఖ్యాత ఇంజినీర్ స్వర్గీయ కె ఎల్ రావు గారి చేతుల మీదుగా రామపాద సాగర్ పేరుమీద అంచనాలు తయారయిన పోలవరం ప్రాజెక్ట్ అప్పటినుంచి నేటివరకు పూర్తి కాకపోవడం గత రెండు శతాబ్దాలలోనే అత్యంత విషాదకర ఘట్టం అని చెప్పుకోవాలి. ఆంధ్రా, తెలంగాణ కలిసిపోయాయి. అరవై ఏళ్ల సంసారం తరువాత మళ్ళీ విడిపోయాయి. పంతొమ్మిది ప్రభుత్వాలు మారాయి. కేంద్రంలో అనేక ప్రభుత్వాలు మారిపోయాయి. కొన్ని కోట్ల లక్షల కోట్ల బడ్జెట్లను ఈ దేశంకోసం ఖర్చు చేశారు. అయినప్పటికీ కొద్ది వేలకోట్ల రూపాయలు ఖర్చయ్యే పోలవరం ప్రాజెక్ట్ మాత్రం పూర్తికాలేదు అంటే విచిత్రం కాదూ? రెండేళ్లక్రితం యాభై అయిదువేల కోట్ల రూపాయల అంచనాను పార్లమెంట్ సాక్షిగా ఆమోదించిన కేంద్రప్రభుత్వం తాజాగా దానికి కొర్రీ వేసి ఇరవైవేల కోట్ల రూపాయలు మాత్రమే ఆమోదిస్తాం అంటూ మడతపేచీ పెట్టి ఆంధ్రులను దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనిపై రాజకీయపార్టీల మధ్య విమర్శల జడివాన మొదలైంది. ఇంతకుముందు పార్లమెంటులో ఆమోదించిన అంచనాలను పునరుద్ధరించాలని, కేంద్రమే పూర్తి బాధ్యత తీసుకుని పోలవరాన్ని పూర్తి చెయ్యాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖను రాశారు.
లేఖ రాయడం నేరమా?
అయితే విడ్డూరం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా లేఖను వ్రాయడం చెత్త అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదో పెద్ద తప్పు జరిగిపోయిందంటూ విరుచుకుపడ్డారు. ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి లేఖ రాయడం ఏ విధంగా తప్పవుతుందో చంద్రబాబు నాయుడే చెప్పాలి. ఉత్తరాలు రాయక జగన్ ఢిల్లీ వెళ్లి మోడీ కాలర్ పట్టుకోవాలా ఏమిటి? అంటూ చంద్రబాబు ప్రకటనను ఎద్దేవా చేస్తున్నారు మేధావులు. చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నడూ కేంద్రప్రభుత్వానికి లేఖలు వ్రాయలేదా అంటూ నిలదీస్తున్నారు. విశేషం ఏమిటంటే మోడీకి లేఖను రాయడం తప్పు పట్టిన చంద్రబాబు పార్లమెంట్ సాక్షిగా ఆమోదించిన అంచనా వ్యయాన్ని ఎందుకు తగ్గించారు అని మోడీని నిలదీసే సాహసాన్ని ప్రదర్శించలేకపోతున్నారు. ఆయన అవసరాలు, బలహీనతలు ఆయనవి పాపం!
వైఎస్ పగ్గాలు చేపట్టాకే….
పోలవరం ప్రాజెక్టును తొమ్మిదేళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పాలించిన చంద్రబాబు అసలు పట్టించుకోలేదు. ప్రాజెక్టులు దండుగమారి ఖర్చు అని ఆయన అభిప్రాయం. ఆయన స్వతహాగా రైతు వ్యతిరేకి. కార్పొరేట్లకు ముద్దు బిడ్డ. రాష్ట్రానికి సీఈవోగా తనను తాను ప్రకటించుకున్న గొప్ప రైతు పక్షపాతి! కరెంట్ చార్జీలు తగ్గించమని ఉద్యమం చేసిన రైతులపై కాల్పులకు తెగబడ్డ నియంత. పదునాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక్కటంటే ఒక్క సాగునీటి ప్రాజెక్టును నిర్మించలేకపోయారు. పోలవరం కోసం వైఎస్ తవ్వించిన కాలువలకు మోటార్లు బిగించి తాను పట్టిసీమ నిర్మాతను అని నిస్సిగ్గుగా ప్రకటించుకున్నారు. 2004 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత పోలవరం ప్రాజెక్టుకు కావలసిన అన్ని రకాల అనుమతులను సాధించి కొన్ని పనులను కూడా మొదలు పెట్టారు.
చంద్రబాబు ఒక్క కాలువైనా తవ్వించారా?
దురదృష్టం కొద్దీ హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించడంతో పోలవరం కూడా పడకేసింది. రాష్ట్రం విడిపోయాక తొలి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు అయిదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ పోలవరం ప్రాజెక్టును పూర్తిచెయ్యలేకపోయారు. కేంద్రంలో అధికార భాగస్వామ్యం ఉన్నది. ఎన్డీయేలో భాగస్వామ్యం ఉన్నది. మోడీతో స్నేహం ఉన్నది. అయినప్పటికీ మోడీతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని ప్రాజెక్టును పూర్తి చెయ్యాలనే సంకల్పం కూడా ఆయనలో లోపించింది మరి! పైగా విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వమే పూర్తి చెయ్యాల్సిన ప్రాజెక్టును వారినుంచి లాగేసుకుని “మీరు నిధులు ఇవ్వండి..మేము కట్టుకుంటాం” అని ఆ బాధ్యతను తాను తీసుకొన్నారు. దాంతో ప్రాజెక్ట్ నత్తనడక మొదలుపెట్టింది. ఎందుకంటే చంద్రబాబు ఏనాడూ ఒక కాలువ తవ్వించి కూడా ఎరుగడు. పునాదిరాళ్ళు వెయ్యడం తప్ప ప్రారంభోత్సవాలు చెయ్యడం చంద్రబాబు జీవితంలో సంభవించిన దాఖలా లేదు. అంతెందుకు? కృష్ణా పుష్కరాల సమయంలో కేంద్రం నిధులతో 2016 లో మొదలు పెట్టిన కనకదుర్గమ్మ వారధి ఆ తరువాత మూడున్నరేళ్ళపాటు అధికారంలో ఉన్నప్పటికీ చంద్రబాబు పూర్తి చేయలేకపోయారు. కేవలం నాలుగు వందలకోట్ల రూపాయల వ్యయం అయ్యే ఆ రెండున్నర కిలోమీటర్ల వారధిని కూడా పూర్తి చెయ్యలేని చంద్రబాబు యాభై ఆరువేల కోట్ల రూపాయల పోలవరాన్ని పూర్తి చేస్తారంటే హాస్యాస్పదంగా లేదూ? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాతనే ఆ వారధి నిర్మాణం పూర్తయ్యి జగన్ చేతుల మీదుగా ప్రారంభం అయింది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పన్నెండు కిలోమీటర్ల పొడవైన పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించి కేవలం మూడేళ్ళలో పూర్తి చేశారు. యాభై వేలకోట్ల రూపాయల విలువైన కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర సహకారం లేనప్పటికీ సాహసించి అప్పో సొప్పో చేసి మూడేళ్ళలో పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ కారణంగా తెలంగాణ ఆహారధాన్యాల ఉత్పత్తిలో గణనీయమైన ప్రగతిని సాధించింది. వారికంటే ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు మూడు కిలోమీటర్ల పొడవు కూడా లేని కనకదుర్గ వారధిని పూర్తి చేయలేకపోయారు. దానికి కేంద్రం ఇచ్చిన నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో ఆ దుర్గమ్మకే ఎరుక! ఇదీ చంద్రబాబు సమర్ధత!
అనుకూల మీడియా భజనను నమ్ముకుంటే….?
కేవలం తనకు డప్పు కొట్టే మీడియా ఉన్నది కదాని చంద్రబాబు నాయుడు చిత్తం వచ్చినట్లు మాట్లాడితే నమ్మేటంత అమాయకులు ఎవరూ లేరు. జగన్ మీద ద్వేషంతో ఎల్లో మీడియా ఎంత విషాన్ని కుమ్మరించినా, జగన్ చేసే ప్రతి మంచి పనికి చంద్రబాబు అడ్డు పడుతున్నాడని, వ్యవస్థలను కూడా మేనేజ్ చేసి జగన్ కు ఆటంకాలు కల్పిస్తున్నది ఇప్పటికే చంద్రబాబు మీద ప్రజలు ఆగ్రహిస్తున్నారు. తాను చెయ్యడు..ఇతరులను చెయ్యనివ్వడు” అనే వాక్యం చంద్రబాబుకు బాగా సరిపోతుంది. ఒక ప్రతిపక్ష నేతగా చంద్రబాబు తన బాధ్యతను గ్రహించి అవసరమైతే ఢిల్లీ వెళ్లి మోడీని, కేంద్రమంత్రులను కలవాలి. వారిని కలిసి ఒప్పించాలి. రాష్ట్ర ప్రయోజనాలకోసం రాజకీయ విభేదాలు పక్కన పెట్టి చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా తన విధిని నిర్వహించాలి. జనాదరణ పొందాలి. అంతే తప్ప జగన్ ను తిడుతూ, విమర్శిస్తూ, తన భజన మీడియాతో తిట్టిస్తూ వ్యతిరేక కథనాలను గంటలతరబడి ప్రసారం చేయిస్తుంటే ప్రజలు హర్షించరు. కులపిచ్చి మీడియా ఎంతగా భజన చేసినా గత ఎన్నికల్లో తనకు ఘోరపరాజయం ఎదురైందని చంద్రబాబు గ్రహిస్తే మంచిది.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు