చిన్నారుల భవిష్యత్తుకు కేంద్ర ప్రభుత్వ భరోసా.. ‘ఎన్‌పీఎస్ వాత్సల్య’తో సురక్షిత పెట్టుబడి..!

చిన్న పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఎన్‌పీఎస్ వాత్సల్య స్కీమ్’ ఇప్పుడు తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షిస్తోంది. గత యూనియన్ బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఈ స్కీమ్‌కు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను పీఎఫ్ఆర్‌డీఏ తాజాగా విడుదల చేసింది. జనవరి 7, 2026న విడుదలైన సర్క్యులర్ ప్రకారం అవసరమైన సాంకేతిక మార్పులు పూర్తయిన వెంటనే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

ఈ స్కీమ్ ద్వారా పిల్లల పేరుపై దీర్ఘకాలిక పెట్టుబడులు చేయడానికి తల్లిదండ్రులు లేదా చట్టబద్ధ సంరక్షకులకు ఒక క్రమబద్ధమైన వేదిక లభించనుంది. పీఎఫ్ఆర్‌డీఏ వద్ద నమోదు అయిన పెన్షన్ ఫండ్స్‌లో ఏదైనా ఒకదాన్ని ఎంపిక చేసుకుని పెట్టుబడులు ప్రారంభించవచ్చు. పెట్టుబడుల విషయంలో రిస్క్, భద్రతకు సమతుల్యతగా అసెట్ మిక్స్‌ను నిర్ణయించారు. ప్రభుత్వ సెక్యూరిటీల నుంచి ఈక్విటీ మార్కెట్ల వరకు విస్తృత అవకాశాలు ఉండటంతో, దీర్ఘకాలంలో మంచి రాబడులు సాధించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టేటప్పుడు మధ్యలో డబ్బు అవసరం అయితే ఎలా అనే సందేహానికి కూడా స్పష్టత ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో పాక్షిక ఉపసంహరణకు అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లల విద్య ఖర్చులు, తీవ్రమైన అనారోగ్య చికిత్సలు లేదా శాశ్వత వైకల్యం వంటి సందర్భాల్లో డబ్బు తీసుకోవచ్చు. అయితే అకౌంట్ తెరిచిన మూడు సంవత్సరాల తర్వాత మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. పెట్టుబడి చేసిన మొత్తంలో గరిష్టంగా 25 శాతం వరకు మాత్రమే ఉపసంహరణకు అనుమతి ఉంటుంది.

పిల్లల వయస్సు 18 ఏళ్లు వచ్చే వరకు రెండు సార్లు, ఆ తర్వాత 18 నుంచి 21 ఏళ్ల మధ్య కేవైసీ పూర్తి చేసిన తరువాత మరో రెండు సార్లు పాక్షికంగా డబ్బు తీసుకునే అవకాశం ఉంటుంది. పిల్లలు మెజారిటీ సాధించిన తర్వాత ఈ అకౌంట్‌ను కొనసాగించాలా లేదా ఇతర ఎన్‌పీఎస్ మోడల్‌కు మార్చాలా అనే ఎంపిక కూడా ఉంటుంది. ఈ దశలో తాజా కేవైసీ, నామినీ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి.

కేవైసీ పూర్తి చేసిన అనంతరం మొత్తం కార్పస్‌లో 80 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 20 శాతంతో యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే మొత్తం కార్పస్ ఎనిమిది లక్షల రూపాయల లోపు ఉంటే, మొత్తం మొత్తాన్ని ఒకేసారి తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇది మధ్యతరగతి కుటుంబాలకు కీలకమైన ప్రయోజనంగా మారనుంది.

ఎన్‌పీఎస్ వాత్సల్య అకౌంట్ తెరవాలంటే పిల్లల జనన ధ్రువీకరణ పత్రాలు, తల్లిదండ్రులు లేదా సంరక్షకుల కేవైసీ పత్రాలు అవసరం. ఎన్‌ఆర్‌ఐలు కూడా జాయింట్ ఎన్ఆర్ఈ లేదా ఎన్ఆర్ఓ ఖాతా ద్వారా ఈ స్కీమ్‌లో చేరవచ్చు. క్రమశిక్షణతో, దీర్ఘకాలికంగా పెట్టుబడులు కొనసాగిస్తే, పిల్లల చదువు, జీవన భద్రత కోసం ‘ఎన్‌పీఎస్ వాత్సల్య’ ఒక బలమైన ఆర్థిక పునాది కావచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.