గులాబీ పార్టీలో రచ్చ తారాస్థాయికి చేరింది. ‘ముఖ్యమంత్రి’ పదవి చుట్టూ గత కొద్ది రోజులుగా జరుగుతున్న రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వయంగా చేశాక, వివాదం మరింత ముదిరి పాకాన పడింది. ‘పదేళ్ళు నేనే ముఖ్యమంత్రిని..’ అని కేసీఆర్ స్పష్టం చేశాక, కేటీఆర్ అభిమానులు, సోషల్ మీడియా వేదికగా, ‘మరి, మా అన్న కేటీఆర్ ఏమైపోవాలి.?’ అని ప్రశ్నిస్తున్నారు. గులాబీ పార్టీలో కొందరు యువ నాయకులూ ఇదే ప్రశ్నను ఆఫ్ ది రికార్డ్‌గా సంధిస్తున్నారట. పార్టీ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్, ‘ఇంకో పదేళ్ళు నేనే ముఖ్యమంత్రిని.. ఈ విషయంలో ఎవరైనా తేడా వ్యాఖ్యలు చేస్తే, చర్యలు తప్పవ్..’ అని హెచ్చరించడాన్ని, పార్టీలో కేటీఆర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారట.
ఈ అంశంపై కేటీఆర్ ఇప్పటికే స్పందించి, పుకార్లకు అవకాశమివ్వకుండా చేయగలిగి వుంటే.. పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదు. ‘కేసీఆర్ వ్యాఖ్యల తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చీలిక ఖాయమని తేలిపోయింది..’ అంటూ ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ.. పనిలో పనిగా టీడీపీ, వామపక్షాలు నినదిస్తుండడం గమనార్హం. ఒక్క చిన్న రాజకీయ అలజడి, ఏ రాజకీయ పార్టీనైనా అతి తక్కువ సమయంలో నేలమట్టం చేసెయ్యగలదు. ఇది తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి తెలియనిదేమీ కాదు. కాంగ్రెస్, టీడీపీ.. తదితర పార్టీల్ని కేసీఆర్ ఇలాగే దెబ్బకొట్టారు. ‘నువ్వు నేర్పిన విద్యయే..’ అన్న చందాన, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిని దెబ్బకొట్టేందుకు అటు బీజేపీ, ఇంకో వైపు కాంగ్రెస్.. మరో వైపు వామపక్షాలు, టీడీపీ కూడా ప్రయత్నిస్తున్నాయి. గతంలో ఓ లెక్క, ఇప్పుడు ఇంకో లెక్క. ముఖ్యమంత్రి పదవి కోసం టీఆర్ఎస్‌లో కనిపిస్తున్న పోటీ, ఆతృత.. ఇవన్నీ రాజకీయ ప్రత్యర్థులకు కలిసొస్తున్నాయి. అసలు కేటీఆర్ విషయంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు అంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు, మంత్రి ఈటెల రాజేందర్ ఎందుకు నైరాశ్యం ప్రదర్శిస్తున్నారు.? అన్న ప్రశ్నలకు సమాధానం అందరికీ తెలిసిందే. గులాబీ బాస్ కోలుకోకపోతే, తెలంగాణ రాష్ట్ర సమితి అతి త్వరలో భారీ పతనం ఎదుర్కోక తప్పదేమో.