జనసేన అధినేత పవన్ కళ్యాణ్, గ్రేటర్ ఎన్నికల సమయంలో ఢిల్లీకి వెళ్ళడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ – జనసేన మధ్య ‘పొత్తు’ వున్నప్పటికీ, రెండు పార్టీల మధ్యా సరైన అవగాహన గ్రౌండ్ లెవల్‌లోనే కాదు, ముఖ్య నేతల స్థాయిలోనూ కొరవడుతుండడంతో, తాడో పేడో తేల్చుకోడానికే జనసేనాని బీజేపీ జాతీయ అధ్యక్షుడితో చర్చల కోసం ఢిల్లీకి వెళ్ళారంటున్నారు. అయితే, బీజేపీ అధినాయకత్వమే, జనసేనానిని ఢిల్లీకి పిలిపించిందనే చర్చ కూడా జరుగుతోంది.
మేటర్ నిజంగానే చాలా సీరియస్..
గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పార్టీ, బీజేపీతో కలిసి పోటీ చేసి వుంటే, ఖచ్చితంగా ఎన్నో కొన్ని చోట్ల విజయం సాధించి వుండేది. బీజేపీకి కూడా అడ్వాంటేజ్ అయి వుండేది. కానీ, కేవలం బీజేపీ మాత్రమే బరిలోకి దిగడం వల్ల, జనసైనికుల్లో తీవ్ర అసహనం కనిపిస్తోంది. అది బీజేపీకి కూడా ఏమాత్రం మంచిది కాదు. అయితే, అధినేత పవన్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో, జనసైనికులు పైకి తమ ఆవేదనను వెల్లగక్కలేకపోతున్నారు. ఇది బీజేపీ నాయకత్వం దృష్టికి వచ్చినట్లే కనిపిస్తోంది.
బీజేపీ తాజా ఆందోళన ఇదీ..
అధికారంలో వున్న పార్టీతో తలపడటమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. దుబ్బాక ఉప ఎన్నికకీ, గ్రేటర్ ఎన్నికలకీ చాలా తేడా వుంది. ఎక్స్ అఫీషియో ఓట్లతో టీఆర్‌ఎస్ ఇప్పటికే స్ట్రాంగ్‌గా వుంది. అలాంటప్పుడు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకూడదు. దురదృష్టవశాత్తూ జనసేనతో పొత్తు విషయమై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు చేసేశారు. అది గ్రౌండ్ లెవల్‌లో తమను దెబ్బతీస్తుందన్న భావనలో వున్నారు కమలనాథులు.
పొత్తుల చర్చలు సరే.. రాజకీయ స్పష్టత ఏదీ.?
గ్రేటర్ ఎన్నికలనేది తాత్కాలి వ్యవహారం. భవిష్యత్ రాజకీయ వ్యూహాలు సరిగ్గా లేకపోతే, ఈ రెండు పార్టీల పొత్తులో అర్థమే వుండదన్నది జనసేనాని భావన. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నిక.. ఇలా చాలా వ్యవహారాలున్నాయి. ఈ నేపథ్యంలోనే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనంతట తానుగా చొరవ తీసుకుని ఢిల్లీకి వెళ్ళారట. ఈ క్రమంలో జనసేన అధినేతకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సహా పలువురు బీజేపీ ముఖ్య నేతలు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారని సమాచారం.